ఏనుమాముల మార్కెట్‌‌‌‌లో ..  ఆలస్యంగా మొదలైన అమ్మకాలు

ఏనుమాముల మార్కెట్‌‌‌‌లో ..  ఆలస్యంగా మొదలైన అమ్మకాలు

వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో గురువారం ఉదయం క్రయవిక్రయాలు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఎలక్షన్ కోడ్ కారణంగా పోలీసులు తనిఖీల పేరుతో వ్యాపారులు, రైతుల దగ్గర ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకుంటున్నారని వ్యాపారులు చాంబర్ ఆఫ్​ కామర్స్​ ఆధ్వర్యంలో మార్కెట్​లోని పత్తి యార్డుతోపాటు పరిపాలన భవనం ఎదుట ఆందోళనకు దిగారు.

దీంతో ఉదయం 7.30 గంటలకు మొదలు కావాల్సిన కొనుగోళ్లు 9.30కు షురూ అయ్యాయి. కాంటాలు కూడా ఆలస్యమయ్యాయి. మార్కెట్ కార్యదర్శి రాహుల్, ఇతర అధికారులు, పోలీసులు వ్యాపారులను సందాయించేందుకు ప్రయత్నించినా వినలేదు. తర్వాత వారితో చర్చించారు. ఇటీవల ముగ్గురు వ్యాపారుల నుంచి రైతులకు చెల్లించాల్సిన డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చాంబర్​ ఆఫ్​ కామర్స్​ అధ్యక్షుడు రవీందర్ ​రెడ్డి అధికారులను కోరారు.

దీనికి ఆఫీసర్లు ఒప్పుకున్నారు. కలెక్టర్​ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతుల కోసం ధర్నా చేస్తున్నామని చాంబర్​ ఆఫ్​ కామర్స్​ప్రతినిధులు చెప్పినా ధర్నాలో ఒక్క రైతూ కనిపించలేదు.