
ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ ఫ్యాన్స్ ను అలరించడం మామూలే. ఆసియా కప్ లో ఆదివారం (సెప్టెంబర్ 28) జరగనున్న మ్యాచ్ ఫైనల్ కావడంతో ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. లీగ్ దశలో మ్యాచ్ చూడడానికి ఆసక్తి చూపించని ఫ్యాన్స్.. ఫైనల్ మ్యాచ్ చూడడానికి ఎగబడుతున్నారు. తరాలు మారినా.. ప్లేయర్లు మారినా దాయాదుల మధ్య సమరానికి ప్రతిసారి భారీ హైప్ ఉంటుంది. చివరిసారిగా 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన దాయాధి జట్లు.. 18 ఏళ్ళ తర్వాత మరోసారి ఫైనల్లో తలపడడంతో ఇండో-పాక్ మ్యాచ్ కు టికెట్స్ రిలీజ్ చేసిన కొన్ని క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. టికెట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోవడంలో ఆశ్చర్యం లేదంటున్నారు నెటిజన్స్.
ఆసియా కప్ ఫైనల్ కు టికెట్లు సోల్డ్ ఔట్:
ఆసియా కప్ లీగ్ దశలో ఉన్నప్పుడు ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ చూడడడానికి ఫ్యాన్స్ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ దాయాధి జట్లు ఫైనల్ కు చేరుకోవడంతో మ్యాచ్ చూడడానికి ఎగబడుతున్నారు. పాకిస్థాన్ తో మ్యాచ్ వద్దని బాయ్ కాట్ డిమాండ్స్ టోర్నీ ప్రారంభంలో ఎక్కువగా వినిపించాయి. అయితే మెగా ఫైనల్ కు ముందు టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇండియా-పాకిస్థాన్ మధ్య గ్రూప్ దశ లో జరిగిన మ్యాచ్ కు 20,000 మంది అభిమానులు వచ్చారు. సూపర్ ఫోర్ ఫైట్ కు 17,000 మంది హాజరయ్యారు. ఆసియా కప్ ఫైనల్ టిక్కెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని 28,000 సీట్లు బుక్ అయ్యాయి.
ఆసియా కప్ ప్రారంభంలో ఆకాశాన్ని దాటిన టికెట్ రేట్లు:
ఆసియా కప్ లో ఈ సారి ప్యాకేజ్ సిస్టమ్ ప్రవేశపెట్టడంతో రేట్లు భరించలేక అభిమానులు టికెట్స్ కొనడానికి ఆసక్తి చూపించలేదు. ఈ ప్యాకేజ్ సిస్టంలో ఒకే మ్యాచ్‌కు టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ను ఇతర గ్రూప్ మ్యాచ్‌లతో కలిపి ప్యాకేజీగా విక్రయించారు. ఈ ప్యాకేజీలలోని టికెట్ ధరలు క్రికెట్ ఫ్యాన్స్ ను బయపెట్టాయి. కొన్ని ప్రీమియం ప్యాకేజీలు అయితే ఏకంగా రూ. 2.5 లక్షల వరకు ఉన్నాయి. VIP సూట్స్ ఈస్ట్‌లో ఇంకా టిక్కెట్లు మిగిలి ఉన్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక రాయల్ బాక్స్‌లో టిక్కెట్లు కూడా మిగిలి ఉన్నాయి. దీని ధర ఇద్దరు వ్యక్తులకు రూ. 2,30,700 కాగా, స్కై బాక్స్ ఈస్ట్ ధర రూ.1,67,851గా ఉంది. వయాగోగో, ప్లాటినంలిస్ట్‌లో రెండు సీట్ల ధర రూ. 2,57,815గా ఉంది.
ఫైనల్ కు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్:
ఫైనల్ మ్యాచ్ కు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్, పాక్ మంత్రి మొహ్సీన్ నఖ్వీ హాజరవనున్నారు. మ్యాచ్ అనంతరం ఆయనే ట్రోఫీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పాక్ క్రికెట్ బోర్డుకు కూడా ఆయనే హెడ్. అయితే మ్యాచ్ కు నఖ్వీ రావడం సాధారణవిషయమే. కానీ ఏసీసీ ఛైర్మన్ హోదాలో ట్రోఫీ ప్రజెంట్ చేయడంపైనే చర్చంతా. ఛైర్మన్ గా ట్రోఫీ ఇవ్వడం మ్యాండేటరీ. దానికి తోడు ఇరు జట్ల సభ్యులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ ప్లేయర్లతో నో షేక్ హ్యండ్ పాలసీ మెయింటైన్ చేస్తున్న టీమిండియా.. పీసీబీ చీఫ్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేదే సస్పెన్స్. అయితే ఈ విషయంపై బీసీసీఐ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు.