- తన వర్గానికే టికెట్లు ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పట్టు
- టికెట్ రాని పక్షంలో ప్రత్యామ్నాయాలపై ఎమ్మెల్యే సంజయ్ వర్గం సమాలోచనలు
- ఉత్కంఠగా మారిన జగిత్యాల, రాయికల్ బల్దియా ఎన్నికలు
జగిత్యాల, వెలుగు: ఇద్దరు ప్రధాన నేతల మధ్య విభేదాలతో జగిత్యాల, రాయికల్ బల్దియాల్లో టికెట్లు ఎవరికో ఇంకా ఫైనల్ కాలేదు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గాల మధ్య రాజీ కుదరకపోవడంతో కాంగ్రెస్ పెద్దలు తలలుపట్టుకుంటున్నారు. దీంతో జగిత్యాల, రాయికల్ బల్దియాల్లో పార్టీ బీ-ఫామ్‌ల పంపిణీపై ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్లకు శుక్రవారం ఒక్కరోజే అవకాశం ఉండడంతో ఏంచేయాలో అయోమయంలో ఆశావహులు ఉన్నారు. ఎవరికి టికెట్ వస్తుందన్న టెన్షన్ ఇరువర్గాల లీడర్లలో ఉత్కంఠ నెలకొంది.
టికెట్ల విషయంలో జీవన్‌రెడ్డి గట్టి పట్టు
మొదటి నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం పోరాటం చేసిన కార్యకర్తలకు న్యాయం జరగాలంటే వారికే అవకాశం ఇవ్వాలని ఆయన పార్టీ హైకమాండ్‌ను కోరుతున్నారు.
ఇటీవల హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ పరిధి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఆహ్వానించడంపై జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
అవసరమైతే బరిలో ఇండిపెండెంట్లుగా..?
జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లకు భారీగా డిమాండ్ ఉంది. ఈక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తన అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అంతర్గత పరిస్థితులు, బీ-ఫామ్‌ల జాప్యం నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ దక్కని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించినట్లు సమాచారం.
అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశాన్ని కూడా పరిశీలించాలన్న దిశగా చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలు జగిత్యాల, రాయికల్ బల్దియాల్లో ఇప్పటికే కొనసాగుతున్న వర్గపోరుకు మరింత పదును పెంచుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీ ఫామ్‌ల పంపిణీలో అనిశ్చితి
ఓవైపు మాజీ మంత్రి, మరోవైపు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మధ్య విభేదాలతో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బీ ఫామ్‌ల పంపిణీలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. డీసీసీ అధ్యక్షుడు గాజేంగి నందయ్య ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించినప్పటికీ అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు.
కాగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు నామినేషన్లు వేస్తున్నారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో, అంతకు ఒకరోజు ముందు అభ్యర్థులకు పార్టీ బీ-ఫామ్‌లు అందజేసే అవకాశమున్నట్లు సమాచారం.
