డబ్బులున్నోళ్లకే టికెట్లు ఇచ్చిన్రు

డబ్బులున్నోళ్లకే  టికెట్లు ఇచ్చిన్రు

కీసర, నాగారం మున్సిపల్​ టీఆర్ఎస్​ స్థానిక నేతల ఆరోపణ

కీసర, మేడ్చల్, వెలుగు: మంత్రి మల్లారెడ్డి మున్సిపల్​ టికెట్లు అమ్ముకున్నారని, డబ్బులున్నోళ్లకే కట్టబెట్టారని టీఆర్ఎస్ స్థానిక నేతలు సుర్వి శ్రీనివాస్​గౌడ్, కౌకుట్ల కృష్ణారెడ్డి ఆరోపించారు. పోటీలో ఉండకుండా నామినేషన్లు విత్​డ్రా చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారని చెప్పారు. నాగారం, కీసర మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్​ నుంచి నామినేషన్​ వేసిన పలువురు క్యాండిడేట్లు.. తమకు టికెట్​ఇవ్వకపోవడంతో మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. తాను తొలి నుంచీ టీఆర్ఎస్​లో ఉన్నానని.. మున్సిపల్​ ఎలక్షన్లలో పార్టీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో నామినేషన్​వేశానని సుర్వి శ్రీనివాస్​గౌడ్ చెప్పారు.

కానీ తనకు ప్రత్యర్థిగా పోటీలో ఉన్న టీడీపీ క్యాండిడేట్​ దగ్గర భారీగా సొమ్ము తీసుకుని.. తనకిచ్చిన బీఫారాన్ని వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకోవడం మంత్రి మల్లారెడ్డికి అలవాటు అని.. మున్సిపల్ ఎలక్షన్లలో డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకున్నారని కీసర సహకార సంఘం అధ్యక్షుడు కౌకుట్ల కృష్ణారెడ్డి ఆరోపించారు. ఇక మేడ్చల్​ మున్సిపాలిటీలో తనకు కౌన్సిలర్​ టికెట్​ ఇవ్వలేదని విజయ్​ అనే కార్యకర్త కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. డబ్బులున్నోళ్లకే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు.