
ముంబై: బ్రిటన్‌కు చెందిన బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ టైడ్ భారత్‌లో వచ్చే ఐదేళ్లలో రూ.6 వేల కోట్లు (500 మిలియన్ పౌండ్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. కంపెనీ ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తాజా పెట్టుబడులతో వచ్చే 12 నెలల్లో 800కి పైగా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అంచనా.
తద్వారా టైడ్ ఇండియా ఉద్యోగుల సంఖ్య 2,300కి చేరనుంది. ప్రొడక్షన్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్, మార్కెటింగ్, మెంబర్ సపోర్ట్, ఆపరేషన్స్ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకుంటామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం టైడ్‌కి భారత్‌లో 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీ, హైదరాబాద్, గురుగ్రామ్ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు.
టైడ్ సీఈఓ ఒలివర్ ప్రిల్ మాట్లాడుతూ, “భారత్‌లోని ఎస్‌ఎంఈ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్దది. టైడ్ గ్లోబల్ స్ట్రాటజీలో ఇది కీలకంగా ఉంది” అని అన్నారు. భారత్‌లో 2022 చివరిలో ప్రారంభమైన టైడ్, ఇప్పటివరకు 8 లక్షల ఎస్‌ఎంఈలకి సేవలందించింది. “ఈ పెట్టుబడితో భారత చిన్న వ్యాపారాల అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తులను తీసుకొస్తాం”అని టైడ్ ఇండియా సీఈఓ గురుజోధ్‌పాల్ సింగ్ అన్నారు.