వేటగాళ్ల ఉచ్చుకు బలైన పులి

వేటగాళ్ల ఉచ్చుకు బలైన పులి
  •    నాలుగేండ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన
  •    ముగ్గురు నిందితుల అరెస్ట్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో వేటగాళ్ల ఉచ్చుకు పులి బలైంది. నాలుగేండ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు పులి శరీర భాగాలను రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు బెల్లంపల్లిలో నాకాబందీ నిర్వహించారు. బెల్లంపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన బాలచందర్ పులి గోళ్లతో పట్టుబడ్డాడు. అదే గ్రామానికి చెందిన బాలచందర్, అంజి, లక్ష్మయ్య కలిసి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కరెంట్ షాక్ పెట్టి పులిని చంపినట్టు వెల్లడించాడు. కళేబరాన్ని అదే ప్రాంతంలో పాతిపెట్టినట్టు తెలిపాడు. ఫారెస్ట్ అధికారులు పులి ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పులి చర్మం, ఇతర శరీర భాగాలు ఏమయ్యాయి, చనిపోయిన పులి ఆడా.. మగా తదితర వివరాలు ఫోరెన్సిక్ రిపోర్టు ద్వారా తెలుస్తాయని డీఎఫ్ఓ పేర్కొన్నారు.