చైనా సరుకుతో యుద్ధం చేయలేమంటున్న పాక్ ఆర్మీ: తుస్సుమంటున్న చైనా బాంబులు, మిస్సైల్స్

చైనా సరుకుతో యుద్ధం చేయలేమంటున్న పాక్ ఆర్మీ: తుస్సుమంటున్న చైనా బాంబులు, మిస్సైల్స్

పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ టార్గెట్‎గా ఇండియా చేస్తున్న దాడులతో అల్లకల్లోలంగా మారింది పాక్ ఆర్మీ. ఇప్పటికే లాహోర్‎లోని ఆర్మీ వైమానిక స్థావరాల్లో.. ఎంతో ఘనంగా.. పాక్ ఆర్మీని కాపాడతాయనుకుని పెట్టుకున్న చైనా సెక్యూరిటీ భద్రత వ్యవస్థ తుస్సు అన్నది. 

దీనికితోడు చైనా నుంచి కొనుగోలు చేసిన మిస్సైల్స్, బాంబులు వంటి యుద్ధ సామాగ్రి, పరికరాలను ఉపయోగించే సత్తా కూడా పాక్ సైనికుల దగ్గర లేకపోవటం అనేది.. ఆపరేషన్ సింధూర్‎తో వెలుగులోకి వచ్చింది. 

భారత్ నుంచి వస్తున్న డ్రోన్లు, మిస్సైల్స్‎ను సైతం పసిగట్టలేని విధంగా చైనా యుద్ధ సామాగ్రి ఉండటంతో.. ఇలాంటి చైనా సరుకుతో యుద్ధం చేయలేం అంటూ పాక్ సైనికులు చేతులెత్తేశారనే వార్తలు వస్తున్నాయి.

 చైనా కూడా డబ్బుల కోసం పాకిస్థాన్‎కు యుద్ధ సామాగ్రి అయితే అమ్మింది కానీ.. వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పించలేదు. ఆర్భాటంగా చైనా  నుంచి కొనుకున్న మిస్సైళ్లు, ఇతర యుద్ధ పరికరాలు ఎలా వాడాలో కనీస అవగాహన లేకపోవడంతో భారత్ చేస్తోన్న దాడులకు ప్రతిదాడి కాదు కదా.. కనీసం అడ్డుకోలేకపోతుంది పాక్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్‎తో పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడుతోంది. దీంతో తమకు సోదరుల్లాంటి ఉగ్రవాదులను కాపాడటం కోసం పాక్ ఆర్మీ శతవిధాల ప్రయత్నిస్తోంది. 

భారత మిస్సైళ్లు, బాంబులు, డ్రోన్లను అడ్డుకునేందుకు బార్డర్ల వద్ద రక్షణ వ్యవస్థలను మోహరించడంతో పాటు చైనా నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్‎పై దాడులు చేసింది. భారత్ మిస్సైళ్లతో విరుచుకుపడుతుండటంతో వాటిని అడ్డుకుని ధ్వంసం చేసేందుకు చైనా నుంచి కొనుగోలు చేసిన హెచ్ క్యూ -9 అనే గగనతల రక్షణ వ్యవస్థను సరిహద్దుల్లో మోహరించింది పాక్. ఇదే  సమయంలో చైనా అందించిన మిస్సైళ్లు, బాంబులు, డ్రోన్లతో భారత్ లోని పలు ప్రాంతాల్లోకి దాడులకు పాల్పడింది. పాక్ దాడులను భారత ఎస్-400 క్షిపణి వ్యవస్థ సమర్ధవంతంగా అడ్డుకుంది. 

ALSO READ | పాక్ మిసైల్ దాడులకు ప్రయత్నించింది.. మేం కూడా అదే రేంజులో బదులిచ్చాం: భారత్

పాకిస్థాన్ మిస్లైళ్లు, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసింది. అలాగే.. బోర్డర్లలో పాక్ మోహరించిన హెచ్ క్యూ -9 రక్షణ వ్యవస్థను ఛేదించి దాయాది దేశంపై భారత్ దాడులు చేసింది. దీంతో చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన హెచ్ క్యూ -9 గగనతల రక్షణ వ్యవస్థ, మిస్సైళ్లపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పాక్ ఆశలన్నీ చైనా యుద్ధ పరికరాలపైనే. కానీ కీలక సమయంలో అవి తేలిపోవడంతో పాక్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే హెచ్ క్యూ -9 గగనతల రక్షణ వ్యవస్థ గురించి, పాక్ మిస్సైళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత ఎస్-400 క్షిపణి వ్యవస్థ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు గగనతల రక్షణ వ్యవస్థల గురించి పూర్తిగా వివరాలు అందిస్తున్నాం.

హెచ్ క్యూ -9

హెచ్ క్యూ -9 అనే గగనతల రక్షణ వ్యవస్థను భారత సరిహద్దుల్లో పాకిస్థాన్​ మోహరించింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ ప్రయోగించిన మిస్సైళ్లను ఇది గుర్తించినా అడ్డుకోలేకపోయింది. రష్యా వద్ద ఎస్-300 అనే మిస్సయిల్ ఉంది. అచ్చం దానిలో ఉన్న ఫీచర్లే, చైనా ఆర్మీ తయారు చేసిన ఈ  క్షిపణిలోనూ ఉన్నాయని అంటారు. దీన్నే పాకిస్థాన్​ సైన్యానికి చైనా విక్రయించింది. పాకిస్తాన్ పై భారత్ డ్రోన్ దాడి చేయగా ఈ నాసిరకం క్షిపణి అడ్డుకోలేక పోయింది. దీంతో చైనాకు చెందిన హెచ్ క్యూ -9  పనితీరు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

భారత్ అమ్ముల పొదిలో.. సుదర్శన చక్రం

ఎస్ 400.. ఇది భారత్ అమ్ముల పొదిలో సుదర్శన చక్రం. ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థలో ఇది కీలకం.  వీటిని రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది.ఇండియా పాక్ హై టెన్షన్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి ఇవి గేమ్ ఛేంజర్‌ గా మారింది. భారత్– పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో ఎస్-400 క్షిపణి వ్యవస్థను బార్డర్‌లో మోహరించారు. దీని పరిధి 40 నుంచి 400 కి.మీ. మధ్య ఉంటుంది. ఈ పరిధిలో శత్రువు క్షిపణి, డ్రోన్లు వస్తే వాటిని గాల్లోనే పేల్చివేస్తుంది. దేశంలోని 15  ప్రాంతాల్లో దాడులు చేయాలని భావించిన పాకిస్తాన్ కు ఈ సుదర్శన చక్రం అడ్డుగా వెళ్లింది.