తిరుమలలో ఫ్రైడ్ రైస్, మంచూరియా బ్యాన్.. అన్ని రకాల చైనీస్ ఫుడ్ నిషేధం

తిరుమలలో ఫ్రైడ్ రైస్, మంచూరియా బ్యాన్.. అన్ని రకాల  చైనీస్ ఫుడ్ నిషేధం

తిరుమల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం.  ఇక్కడకు వచ్చి శ్రీవారిని దర్శించుకొనే భక్తులు ఎంతో నిష్టగా ఉండాలి.  మద్యం.. మాంసం వంటి పదార్దాలను తిరుమలలో అనుమతించరు.  కాని ఇప్పటి వరకు కొన్ని  హోటళ్లలో  చైనీస్​ వంటకాలు.. మంచూరియా.. ఫ్రైడ్​ రైస్​ లభిస్తున్నాయి.  ఇప్పుడు వీటిని కూడా నిషేధించాలని టీటీటీ నిర్ణయం తీసుకుంది. 

తిరుమల హోటళ్లలో మంచూరియా.. ఫ్రైడ్​ రైస్​ తో పాటు చైనీస్​ వంటకాలను టీటీడీ నిషేధించింది.  హోటళ్లలో పరిశుభ్రతల పాటించాలని నిర్వాహకులకు తెలిపింది.  హోటల్​ సిబ్బంది కూడా సంప్రదాయ దుస్తులు ధరించి.. శ్రీవారి భక్తులకు సేవలందించాలని టీటీడీ అద‌న‌పు ఈవో  సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల హోటళ్లు ఎలా ఉండాలి.. ఎలా నిర్వహించాలి.. తీసుకోవలసిన జాగ్రత్తలపై  గురువారం ( మే 8) హోట‌ళ్ల నిర్వాహ‌కులు, స్థానికులతో  అద‌న‌పు ఈవో స‌మావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో హోటల్​ నిర్వాహకుల సమస్యలను అదనపు ఈవో దృష్టికి తీసుకెళ్లారు.  ఈసమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. శ్రీవారి  దర్శనానికి వచ్చే భక్తులు హోటల్​ నిర్వాహకులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన చాలా ఇబ్బంది పడుతున్నారని.. ఇక అలా జరగకుండా తిరుమల యాత్రికులకు మధురానుభూతి కలిగేలాఉండేలా హోటల్​ నిర్వాహకులు తమ పాత్ర పోషించాలన్నారు.   నాణ్యమైన ఆహారం అందించాలని.. పరిసరాలు శుభ్రంగా ఉండాలని వారిని కోరారు.

 మంచూరియా.. ఫ్రైడ్​ రైస్​... చైనా వంటకాలను తిరుమల కొండపై విక్రయించకూడదని  హోటల్​ నిర్వాహకులకు సూచించారు.  నిబంధనలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని.. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు.       ఈ సమావేశంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో  రాజేంద్ర కుమార్, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈ వో  సోమన్నారాయణ, ఎస్టేట్ అధికారి  వెంకటేశ్వర్లు, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి  శాస్త్రి, విజిఓలు  సదాలక్ష్మి, సురేంద్ర ఇతర అధికారులు, హోటళ్ల యజమానులు పాల్గొన్నారు