
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: వేటగాళ్ల ఉచ్చుకు పులి బలైంది. కరెంట్ వైర్లు తగిలి పులి చనిపోయాక దాని చర్మం, గోర్లు, పండ్లను వేటగాళ్లు ఎత్తుకెళ్లారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్ పెంచికల్పేట రేంజ్‌లో 3 రోజుల కింద ఈ ఘటన చోటు చేసుకున్నది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
శనివారం (May 17) పోస్టుమార్టం నిర్వహించి పులి కళేబరాన్ని పూడ్చిపెట్టారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, ఆసిఫాబాద్ డీఎఫ్వో నీరజ్ కుమార్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
‘‘పెంచికల్‌పేట్ రేంజ్‌లో సంచరిస్తున్న పులి.. ఈ నెల 13న చివరిసారి కెమెరాకు చిక్కింది. 15న ఉదయం తునికాకు సేకరణకు వెళ్లిన కూలీలకు పులి పడుకొని ఉన్నట్లు కనిపించడంతో భయపడిన వాళ్లు తిరిగి ఇండ్లకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు చెప్పారు. 15న అడవిలో గాలించగా.. పులి జాడ దొరకలేదు. 16న ఉదయం మళ్లీ అడవిలోకి వెళ్లి గాలింపు చేపట్టగా... నల్లకుంట అటవీ ప్రాంతంలో పులి కళేబరం కనిపించింది. దాని చర్మం, గోళ్లు, పళ్లు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాం. శనివారం ఉదయం కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించాం. చనిపోయింది ఏండేండ్ల వయస్సున్న ఆడ పులి అని తేలింది. శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించాం’’అని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ఎల్లూరు కొమ్ముగూడకు చెందిన పశువుల కాపరులు లేగల వెంకటేశం, లేగల సత్యన్న, లేగల గోపాల్, గోమసె రాజును శనివారం అదుపులోకి తీసుకున్నారు. తమవాళ్లను అకారణంగా అదుపులోకి తీసుకున్నారంటూ కుటుంబ సభ్యులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.