పెద్దపులుల సంఖ్య పెరిగింది..

పెద్దపులుల సంఖ్య పెరిగింది..

దేశంలో పెద్దపులుల సంఖ్య పెరుగుతోంది. కొన్నేళ్ల కిందటి వరకూ తగ్గిన టైగర్ల నంబర్‌‌ క్రమంగా పుంజుకుంటోంది. అంతరించిపోయే దశలో ఉన్న వీటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌‌ టైగర్‌‌’ లాంటి పనులు మొదలుపెట్టడంతో మెల్లమెల్లగా ఎక్కువవుతున్నాయి. 2014లో పోల్చితే ప్రస్తుతం పులుల సంఖ్య 20 శాతం పెరిగింది. అప్పుడు 2,226 ఉంటే ఇప్పుడు 2,600కు పైగా పెరిగాయి. సోమవారం గ్లోబల్‌‌ టైగర్‌‌ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో పులుల సంఖ్యను ప్రకటించనున్నారు. ఆల్‌‌ ఇండియా టైగర్‌‌ ఎస్టిమేషన్‌‌ రిపోర్టు 2018ను కూడా  విడుదల చేయనున్నారు. కార్యక్రమానికి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్‌‌ జవదేకర్‌‌ కూడా హాజరవనున్నారు. అన్ని రాష్ట్రాల చీఫ్‌‌ వైల్డ్‌‌లైఫ్‌‌ వార్డెన్లు, టైగర్‌‌ రిజర్వ్‌‌ ఫీల్డ్‌‌ డైరెక్టర్లను కూడా పిలిచారు. రెండు రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది. వైల్డ్‌‌ లైఫ్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఇండియా, నేషనల్‌‌ టైగర్‌‌ కన్జర్వేషన్‌‌ అథారిటీ మాత్రం ప్రకటించబోతున్న సంఖ్య కన్నా ఎక్కువే టైగర్లు ఉన్నాయని చెబుతున్నాయి.

నాలుగో రిపోర్టు

దేశంలో పులుల సంఖ్యను నాలుగేళ్లకోసారి లెక్కిస్తారు. 2006లో ప్రాజెక్ట్‌‌ టైగర్‌‌ను కొత్తగా స్టార్ట్‌‌ చేశాక ఇది నాలుగో రిపోర్టు. 2006లో 1,411గా ఉన్న టైగర్లు 2010కి 1,726కు పెరిగాయి. తర్వాత 2014లో 2,226 ఉండగా 2018లో 2600కు చేరుకుంది. టైగర్ల సరైన నంబర్‌‌ కనుక్కోడానికి ఈసారి కొత్త పద్ధతిని ఎంచుకున్నామని, గతంలో 4 చదరపుటడుగుల్లో నమూనాలు తీసుకుంటే ఈసారి 2 చదరపుటడుగుల్లోనే తీసుకున్నామని అధికారులు వివరించారు. మహారాష్ట్రలో టైగర్ల సంఖ్య ప్రస్తుతం 230 నుంచి 240 వరకు ఉన్నాయన్నారు. 2006లో 103గా ఉన్న నంబర్‌‌ 2010లో 169కి, 2014లో 190కి పెరిగిందన్నారు. 2014లో తడోబా అంధేరీ టైగర్‌‌ రిజర్వ్‌‌లో 66 టైగర్లుండేవని, ఇప్పుడా సంఖ్య 86కి పెరిగిందని వివరించారు. మధ్యప్రదేశ్‌‌, మహారాష్ట్రల్లో విస్తరించిన ఉన్న పెంచ్‌‌ టైగర్‌‌ రిజర్వ్‌‌లో 2014లో 23 టైగర్లుంటే ఇప్పుడు 38 అయ్యాయని చెప్పారు. మేల్‌‌ఘాట్‌‌ టైగర్‌‌ రిజర్వ్‌‌లోనూ సంఖ్య పెరిగే ఉంటుందన్నారు.  టైగర్లు కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. చంద్రాపూర్‌‌ థర్మల్‌‌ పవర్‌‌ ప్లాంట్‌‌ దగ్గర్లో ఇప్పుడు రెండు ఆడ పులులు, వాటి పిల్లలు ఉన్నాయి. పెంచ్‌‌, తిపేశ్వర్‌‌ (యావత్మాల్‌‌), బోర్‌‌ (వార్దా)ల్లోనూ కనబడుతున్నాయి. పదేళ్ల కిందట నవీగావ్‌‌ (గోందియా, భండారా)ల్లోని పార్కుల్లో టైగర్లు లేవు. కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. తడోబాకు దగ్గర్లోని బ్రహ్మపురిలో 2017లో 44 ఉన్న టైగర్ల సంఖ్య ఇప్పుడు 40కి తగ్గినా సెంట్రల్‌‌ చందాలో పెరిగాయి.