న్యూఢిల్లీ: టీమిండియా యంగ్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ టెస్ట్, వన్డే క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ రెండు ఫార్మాట్లలో ఆడటం తనకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపాడు. ఫిట్‌నెస్ తో పాటు , వికెట్ల మధ్య చురుగ్గా రన్నింగ్ చేసే విషయంలో లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్టు వెల్లడించాడు. తన కెరీర్‌లో నాలుగు వన్డేలు మాత్రమే ఆడిన తిలక్.. టెస్టుల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ బరిలో నిలిచిన హైదరాబాదీ కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్లు జట్టులో ఉండడం వల్ల కుర్రాళ్ల ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని చెప్పాడు.
‘వన్డే, టెస్ట్ క్రికెట్ నా ఆట లాగే అనిపిస్తుంది, ఎందుకంటే నాకు లాంగ్ ఫార్మాట్ అంటే చాలా ఇష్టం. మరిన్ని వన్డేలు ఆడేందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. రోహిత్ భాయ్, విరాట్ భాయ్ జట్టులో ఉండటం మా కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. ఆటపై ఈ ఇద్దరి నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ నుంచి వీలైనంత ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. నేను విరాట్ భాయ్‌తో తరచూ మాట్లాడుతాను. ముఖ్యంగా ఫిట్‌నెస్, వికెట్ల మధ్య రన్నింగ్ గురించి చర్చిస్తా. నాకు కూడా రన్నింగ్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ మేం ఇద్దరం కలిసి బ్యాటింగ్ చేస్తే వికెట్ల మధ్య తనతో పాటు పరిగెత్తడాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నా’ అని తిలక్ చెప్పుకొచ్చాడు.
