
అమరావతి: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం (మే 14) టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశంలో మహానాడు నిర్వహణపై చర్చించారు. మహానాడు నిర్వహణ కోసం మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపైన డిస్కస్ చేశారు.
అనంతరం 2025, మే 27, 28, 29 తేదీల్లో మొత్తం 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. గత ఏడాది ఎలక్షన్ కోడ్ కారణంగా మహానాడు నిర్వహించని విషయం తెలిసిందే. దీంతో ఈ సారి భారీగా మహానాడు నిర్వహించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.
ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో మంత్రి నారా లోకేష్ పలు కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఒక వ్యక్తి ఒకే పదవిలో 3 సార్లు కంటే ఎక్కువ ఉండరాదని లోకేష్ ప్రతిపాదించారు. లోకేష్ ప్రతిపాదనకు టీడీపీ పొలిట్ బ్యూరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. ఆరేళ్లుగా ఉన్న మండల పార్టీ అధ్యక్షులను మార్చాలని నిర్ణయించారు. మూడు సార్లు మండల అధ్యక్షులుగా పని చేసిన వారికి పైస్థాయి పదవి ఇవ్వాలని నిశ్చయించారు. నెలకో సంక్షేమ పథకం అమలు చేసేలా ఏడాది క్యాలెండర్ రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నారు.