వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఖమేనీ ఒక సిక్ మ్యాన్ అని.. అతడికి దేశాన్ని ఎలా పాలించాలో తెలియదని విమర్శించారు. దేశాన్ని హింసాతో కాకుండా గౌరవంతో పాలించాలని హితవు పలికారు. పరిపాలన ఎలా చేయాలో తనను చూసి నేర్చుకోవాలని చురకలు అంటించారు.
ఖమేనీ నియంత పాలన తీరుతో ఆ దేశంలో ప్రజలు బతికే పరిస్థితి లేకుండాపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమేనీ పాలనలో ఇరాన్ ఇప్పటి వరకు ఎన్నడూ చూడని హింసాను చూసిందని అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ దేశ పరిపాలనకు అనర్హుడని అభివర్ణించారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడం, ఖమేనీ పాలనతో విసిగిపోయిన ఇరాన్ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబిక్కి రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దాదాపు మూడు వారాల పాటు ఇరాన్ అల్లర్లతో అట్టుడికిపోయింది. అల్లర్లను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం బల ప్రయోగం చేసింది.
శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తోన్న ప్రజల్ని పిట్టల్ని కాల్చి చంపినట్లు చంపేశారు. ఇరాన్ అల్లర్లో దాదాపు 3 వేల మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు. కానీ మరణాల సంఖ్య 15 వేల వరకు ఉంటుందని ప్రతిపక్షాలు, అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
►ALSO READ | పప్పు ధాన్యాలపై భారత్ సుంకాలు తగ్గించేలా చర్యలు తీసుకోండి: ట్రంప్‌కు అమెరికా సెనేటర్ల విజ్ఞప్తి
ఆందోళనకారుల అణిచివేతను తీవ్రంగా వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిరసనకారులపై బల ప్రయోగం చేస్తే దాడులు చేస్తామని ఇరాన్ నాయకత్వానికి హెచ్చరికలు పంపాడు. దీంతో ఖమేనీ సర్కార్ కాస్తా తగ్గుముఖం పట్టింది. మరోవైపు ఇరాన్‌లో అల్లర్లకు ట్రంపే ప్రధాన కారణమని ఖమేనీ ఆరోపిస్తున్నారు.
దేశ వ్యతిరేక శక్తులు ఆందోళనల్లో పాల్గొంటున్నాయని అన్నారు. ఇరాన్ లో నెలకొన్న అస్థిరత, రక్తపాతానికి ట్రంప్ బాధ్యత వహించాలని ఖమేనీ డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఖమేనీ సిక్ మ్యాన్ అని.. అతనికి పరిపాలన రాదని.. ఇరాన్‌లో నాయకత్వం మారాలని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
