80 కోట్లమందికి 5 నెలలు ఫ్రీరేషన్ : మోడీ

80 కోట్లమందికి 5 నెలలు ఫ్రీరేషన్ : మోడీ
  • ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని
  • అన్‌లాక్‌ 1లో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది
  • ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌1లో ప్రజల్లో నిర్లక్ష్యం బాగా పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సీజన్‌లో వర్షాలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మాస్కులు వాడటం, సోషల్‌ డిస్టెంసింగ్‌ మెయింటైన్‌ చేయడం మానేశారని అది ప్రమాదకరమని చెప్పారు. అన్‌లాక్‌ 2లోకి ప్రవేశిస్తున్నందున మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కంటైన్మెంట్‌ జోన్లపై దృష్టి సారించాలని అన్నారు. కచ్చితంగా నియమాలు పాటించాలని చెప్పారు. సరైన సమయంలో లాక్‌డౌన్‌ పెట్టడం వల్ల చాలా కేసులు తగ్గాయని అన్నారు. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా చాలా స్టేబుల్‌ కండిషన్‌లో ఉందని డెత్‌ రేట్‌ కూడా కంట్రోల్‌లో ఉందని అన్నారు. దేశంలోని ప్రతి ఒకరు రూల్స్‌ పాటించాలని, రూల్స్‌కు ఎవరూ అతీతులు కారని లీడర్‌‌ ఆఫ్‌ ది నేషన్‌ అయినా కూడా కచ్చితంగా రూల్స్‌ పాటించాలని చెప్పారు. రూల్స్‌ పాటించని వారికి అవేర్‌‌నెస్‌ కల్పించాలి.

మరో 5నెలలు గరీబ్‌ కల్యాణ్‌ అన్య్‌ యోజన

రైతుల అకౌంట్లలో ఇప్పటి వరకు నేరుగా18వేల కోట్లు డిపాజిట్‌ చేశామని, వలస కూలీలకు కూడా అందించామని అన్నారు. వలస కార్మికుల కోసం పీఎం గరీభ్‌ కల్యాణ్‌ రోజ్‌గర్‌‌ యోజన లాంచ్‌ చేశామన్నారు. 9000 కోట్లతో గరీభ్‌ కల్యాణ్‌ అన్య్‌ యోజనను ఎక్స్‌టెండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. దాదాపు 80 కోట్ల మందికి ప్రతి నెల 5 కేజీల రేషన్‌, కేజీ కందిపప్పు ఫ్రీగా అందించామని చెప్పారు. ఈ క్రైసిస్‌లో ప్రజలకు కావాల్సిన సపోర్ట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. రానున్న నెలల్లో వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో మరో ఐదు నెలల పాటు ఫ్రీగా ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ఇస్తామని మోడీ అన్నారు. నవంబర్‌‌ వరకు దీన్ని అందిస్తామని అన్నారు.  దేశం మొత్తం ఒన్‌ నేషన్‌ ఒన్‌ రేషన్‌ కార్డ్‌ తీసుకొస్తామని, దీని వల్ల వలస కూలీలకు ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు.