అమెరికాలో కాల్పుల మోత.. ఉలిక్కిపడిన టైమ్స్‌ స్వ్కేర్‌.. తుపాకీతో కాల్పులు జరిపిన 17 ఏళ్ల పోరడు

అమెరికాలో కాల్పుల మోత.. ఉలిక్కిపడిన టైమ్స్‌ స్వ్కేర్‌.. తుపాకీతో కాల్పులు జరిపిన 17 ఏళ్ల పోరడు

అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్కేర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. పర్యాటక ప్రాంతంలో చెలరేగిన హింసతో టూరిస్టులు ఉలిక్కిపడ్డారు. అక్కడ నుంచి భయంతో పరుగులు తీశారు. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు తెగబడింది 17 ఏళ్ల టీనేజర్ అని న్యూయార్క్ పోలీసులు నిర్ధారించారు. ఈ టీనేజర్కు, మరో వ్యక్తికి గొడవ జరిగిందని.. ఈ గొడవ ముదిరి నిందితుడు ఓపెన్ ఫైర్ చేశాడని విచారణలో తేలింది.

18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు, 65 ఏళ్ల వృద్ధుడు ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 6 గంటల 20 నిమిషాల సమయంలో మాన్ హట్టన్ టూరిస్ట్ స్పాట్లో ఈ ఘటన జరిగింది. వెస్ట్ 44th స్ట్రీట్ నుంచి 7th అవెన్యూ వరకూ భారీగా పోలీసులు మోహరించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని.. విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. వాస్తవానికి టైమ్స్ స్వ్కేర్ ‘గన్ ఫ్రీ జోన్’. అంటే.. పర్మిట్ ఉన్నా సరే టైమ్స్ స్వ్కేర్ సమీప ప్రాంతాల్లో గన్తో తిరగడం నిషేధం. అలాంటి చోట ఒక మైనర్ గన్తో కాల్పులు జరపడం ఆందోళన కలిగించే విషయం.

ఈ ఘటనలో ఒక బ్లాక్ కారు కూడా డ్యామేజ్ అయింది. ఈ కాల్పుల్లో గాయపడిన 18 ఏళ్ల యువతి మెడకు బులెట్ గాయమైనట్లు తెలిసింది. 19 ఏళ్ల యువకుడికి కుడి పాదానికి, 65 ఏళ్ల వృద్ధుడికి ఎడమ కాలికి గాయమైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను Bellevue Hospitalకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మాన్ హట్టన్ ప్రాంతంలో జులై 28న సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పులు జరిగిన రోజుల వ్యవధిలోనే టైమ్స్ స్వ్కేర్ దగ్గర కాల్పులు జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే టూరిస్టులు ఎక్కువగా విజిట్ చేసే ప్రదేశాల్లో టైమ్స్ స్వ్కేర్ ఒకటి. సంవత్సరానికి సుమారు 50 మిలియన్ల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. రోజుకు సుమారు 3 లక్షల 30 వేల మంది టూరిస్టులు టైమ్స్ స్వ్కేర్ను విజిట్ చేస్తుంటారు. అలాంటి చోట కాల్పుల మోత మోగడంతో టూరిస్టులు ఉలిక్కిపడ్డారు.