గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న!
  • కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్  

హైదరాబాద్, వెలుగు :  నల్గొండ– ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పలు సార్లు సీఎం రేవంత్​ను, కాంగ్రెస్ పెద్దలను మల్లన్న కలిసినపుడు ఈ అంశంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

యూత్, గ్రాడ్యుయేట్లలో మంచి ఫాలోయింగ్ ఉన్నందున ఆయనకు టికెట్ ఇచ్చే అంశంపై పార్టీ నేతలంతా మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఈ సీటు నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. 

2021లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓట్లు 83,520 వచ్చాయి. అప్పటి అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. ఒక దశలో మల్లన్నదే గెలుపన్న ప్రచారం జరిగింది. పల్లా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవకుండా మల్లన్న అడ్డుకట్ట వేసినా, రెండో ప్రాధాన్యత ఓట్లతో ఎమ్మెల్సీగా గెలుపొందారు.