
కిడ్నీలు ఫెయిలై చనిపోయినట్లుగా తరచుగా వింటున్నాం. ఆలోపతి మెడికల్ ఫీల్డులో అన్ని రకాల కిడ్నీ సమస్యలకు మందులున్నాయి. మందులకు తగ్గని మొండి రోగాలకు వేరే విధానాలూ ఉన్నాయి. అయినా ఏటా వేలాది మంది చనిపోతున్నారు. కిడ్నీ సమస్యలు తగ్గకుండా జీవిత కాలం వేధించడానికి కారణం పేషెంట్ చేసే చిన్న పొరపాట్లే అంటున్నారు డాక్టర్ శ్రీభూషణ్ రాజు. పొరపాటు చిన్నదే అయినా శిక్ష మాత్రం చాలా పెద్దది. అవగాహన లేకపోవడమే కిడ్నీ రోగుల మరణాలకు అసలు కారణం అంటున్నారాయన. పేషెంట్‌లకే కాదు అందరికీ కిడ్నీసమస్యల పట్ల అవగాహన ఉండాలి. అప్పుడే ఈ అపోహలన్నీ పోతాయి అంటున్నారాయన.
కిడ్నీ ఫెయిల్యూర్‌తో ఎవరూ చనిపోరు. రోగికి కిడ్నీ సమస్య గురించి అవగాహన లేకపోవడం, డాక్టర్లు చెప్పినట్లుగా మందులు వాడకపోవడం, డయాలసిస్ చేయించుకోమని చెప్తే తప్పించుకోవడం, డయాలసిస్‌కు భయపడటం, డయాలసిస్ చేస్తే మందులు వాడకున్నా నడుస్తుందనుకోవడం వల్లే సమస్య తీవ్రమవుతుంది.
కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఫెయిల్ సమస్యతో బాధపడే వాళ్లలో ఎక్కువ మంది మందులతోనే తగ్గించుకోవాలని అనుకుంటారు. అది మందులతో తగ్గదని డాక్టర్లు చెప్పాక కూడా మందులతో తగ్గిద్దేమో చూడమని అడుగుతారు. కాదంటే మరో డాక్టర్ దగ్గరకు పోతారు. లేదంటే వేరే పద్ధతుల వైపు మళ్ళుతారు. పసర్లు తాగుతున్నారు. వాటివల్ల శరీరంలో టాక్సిన్స్ పెరుగుతాయి. కిడ్నీ మరింతగా పాడవుతుంది. ఇంకొంతమంది చిట్కా వైద్యంతో తగ్గుతోందని నమ్మి, మోసపోతున్నారు.
డయాలసిస్ ఫోబియా
కిడ్నీలు పని చేయడం తగ్గిపోయినా ప్రాణానికి ప్రమాదమేమీ లేదు. 80 శాతం పాడయ్యేంత వరకు ఏ సమస్యా ఉండదు. అంతకంటే ఎక్కువగా పాడయితే డయాలసిస్ అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి ‘ఫిస్టులా’ వేయించుకోమంటే చాలా మంది జీవితకాలం డయాలసిస్ చేస్తారని తప్పించుకుని పోతున్నారు. డయాలసిస్ చేసుకోవాలని చెప్పిన తర్వాత చేయించుకోక మరణించేవాళ్లు 25 శాతం ఉంటారు. డయాలసిస్ కు భయపడి రకరకాల పద్ధతుల్ని పాటించి, చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత డయాలసిస్ కావాలంటున్నారు. కానీ అప్పటికే శరీరంలో వ్యర్థా లు పెరుగుతాయి. ఇతర అవయవాలు కూడా కొంత పాడవుతాయి. డయాలసిస్ ని మొదలుపెడితే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్లకి ఏ సమస్యా ఉండదు.
శిక్షణలేకపోతే శిక్షే
డయాలసిస్ చేయించుకుంటే ప్రాణానికి ముప్పు లేదనుకుంటున్నారు. కానీ డయాలసిస్ సరిగా చేస్తున్నారా? అనే విషయం పట్టించుకోవట్లేదు. చాలా డయాలసిస్ సెంటర్లలో అవగాహన లేనివాళ్లే డయాలసిస్ చేస్తున్నారు. ఈ సమస్య మన దేశంలో తీవ్రంగా ఉంది. మన దేశంలో డయాలిసిస్ యూనిట్‌ని నిర్వహించే నిపుణులకు సరైన శిక్షణలేకపోవడమే కారణం. డయాలసిస్ చేయించుకునేటప్పుడు చాలా చోట్ల డాక్టర్ల పర్యవేక్షణ ఉండదు. హీమో డయాలసిస్‌ను డాక్టర్ల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. డాక్టర్లను సంప్రదించకుండా, రివ్యూ లేకుండా టెక్నీషియన్లతోనే డయాలసిస్ చేయించుకోవడం ప్రమాదం.
ఫిస్టులాని వాయిదా వేయొద్దు
డయాలసిస్ ప్రారంభించాలని చెప్పగానే ఫిస్టులా (స్టెంట్) వేయించుకోవాలి. డయాలసిస్ యూనిట్ ఒంట్లోని రక్తాన్ని తీసుకోవడానికి ఇది తగినట్లుగా ఉంటుంది. ఆపరేషన్ చేయించుకుని స్టెంట్ వేయించుకోకుండా చాలామంది సూదులతోనే కానిచ్చేద్దాం అనుకుంటున్నారు. కొన్నాళ్లకు ఆ రక్తనాళాలు డయాలసిస్‌కు అనుకూలంగా ఉండవు. అప్పుడు స్టెంట్ కూడా వేయలేం. ప్రత్యామ్నాయంగా తొడలో ప్లాస్టిక్ ట్యూబ్‌ని అమర్చుతారు. ఇవి సరిగా లేక కొందరికి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ శరీరంలో వ్యాపిస్తుంది. గుండె, లివర్ పాడవుతాయి. మరణానికి దారితీస్తాయి.
రాళ్లు తీసినా కిడ్నీ ఫెయిల్
రాళ్లు తీసినా కిడ్నీ ఫెయిల్ రాళ్ల వల్ల కిడ్నీ పాడయిన వాళ్లు 15 శాతం మంది ఉంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం ఒక సమస్యే. కానీ, కిడ్నీలు పాడవడానికి రాళ్ల కంటే రోగి నిర్లక్ష్యమే కారణం. రాళ్లు ఏర్పడితే వాటిని తొలగించే విధానాలున్నాయి. కానీ డాక్టర్లు చెప్పినా పేషంట్లు ఆపరేషన్‌కు సిద్ధపడరు. వాళ్లకు నచ్చినట్లు గా ట్రీట్‌మెంట్ చేయమంటారు. ఎక్కువ మంది ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గించాలని డిమాండ్ చేస్తారు. డాక్టర్లు సాధ్యం కాదంటే కషాయాలు, పసర్లు, మాత్రలు తీసుకుం టారు. ఇలా చేయడం వల్ల రాళ్లు కరగకపోగా కిడ్నీల్లో ఇన్‌ఫెక్షన్ పెరుగుతుంది. ఈ కాలయాపన వల్ల కిడ్నీ ఫెయిలవుతుంది. రాళ్లు తగ్గలేదని చివరికి సర్జరీ చేసుకుం టామంటారు. అది చేస్తే రాళ్లు పోతాయి. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ని సరిచేయలేం. రాళ్లు వస్తే తొందరపడాలి. ప్రణాళికా బద్ధం గా ట్రీట్ మెంట్ చేయించుకుంటే తగ్గుతాయి. డాక్టర్లు ఆపరేషన్ చేసి వాటిని తొలగించాలని చెబితే చిట్కా వైద్యం జోలికి పోకుండా సర్జరీ చేయించుకోవాలి.
ఫెయిలైన కిడ్నీలు మళ్లీ పనిచేస్తాయా?..
టెంపరరీ కిడ్నీ ఫెయిల్ అయిన సమస్యను సరిచేస్తే మళ్లీ కిడ్నీలు సరిగానే పనిచేస్తాయి. కిడ్నీలు తాత్కాలి కంగా పనిచేయకపోవడానికి కారణాన్ని గుర్తించి ట్రీట్‌మెంట్ చేస్తారు. ఈ టైంలో కొన్నిసార్ లు డయాలసిస్ అవసరం. డయాలసిస్ చేయకపోతే శరీరంలో వ్యర్థాలు పెరిగిపోయి ట్రీట్‌మెంట్ వృథా అవుతుంది.