V6 News

ఈ ఎండా కాలం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

ఈ ఎండా కాలం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

భానుడు  భగభగ  మండుతూ  నిప్పుల వాన  కురిపిస్తుండు.  రోజురోజుకూ  ఎండ తీవ్రత  పెరుగుతోంది. ఈ  సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ప్రాణాలకే  ముప్పు  వాటిల్లుతుంది.  వేసవికాలంలో  ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి  ముందస్తు జాగ్రత్తలు,  సూచనలు  పాటించడం వల్ల  వేసవిలో పొంచి ఉన్న  వడదెబ్బ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. వేసవి కాలంలో తీవ్రమయ్యే  వడదెబ్బ గురించి ప్రతిఒక్కరూ  అవగాహన పెంచుకోవాలి.

సాధారణంగా  మనిషి  శరీరంలో  80 శాతం నీరు ఉంటుంది.  మండుటెండల్లో  తిరిగినప్పుడు  వేడి గాలుల తీవ్రతకు  ఈ నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. చెమట రూపంలో నీటితో పాటు సోడియం, పొటాషియం వంటి లవణాలు బయటకుపోతాయి. అవి శరీరంలో ఉన్నంత సేపు మనిషి ధృఢంగానే ఉంటాడు.  క్రమంగా వాటి పరిమాణం తగ్గుతుంటే  మనిషి శరీరంలో నిస్సత్తువ పెరుగుతుంది.  బాధిత వ్యక్తి చివరికి మంచి నీటిని సైతం  తాగలేని  స్థితికి వెళతాడు. అప్పుడు వడదెబ్బ తగిలినట్లుగా భావించాలి.

వడదెబ్బ లక్షణాలు: శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా  పెరగడం.  ఉష్ణోగ్రత  40.6  డిగ్రీ  సెల్సియస్  లేదా 105.1 డిగ్రీస్  ఫారెన్​ హీట్ కంటే ఎక్కువగా ఉండటం.  చర్మం  పొడిబారడం,  మూత్రం  చిక్కని పసుపు రంగులో ఉండి మంటగా రావడం,  నాడి వేగంగా కొట్టుకోవడం,  నాలుక  ఎండిపోవడం,  తీవ్రమైన తలనొప్పి,  చెమటలు పట్టకపోవడం, శరీరం  నీటిశాతం  కోల్పోవడం,  బీపీ తగ్గడం,  పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితికి చేరడం మొదలైనవి వడదెబ్బ లక్షణాలుగా గుర్తించాలి.

ప్రథమ చికిత్స: వడదెబ్బ  తగిలిన  వ్యక్తిని  త్వరగా  నీడగల  ప్రదేశానికి  చేర్చాలి. దుస్తులు వదులుగా చేసి చల్లని గాలి  తగిలే విధంగా చేయాలి. ఉష్ణోగ్రతను తగ్గించడానికి  చల్లని నీటిలో  ముంచిన గుడ్డతో పలుమార్లు శరీరం తుడవాలి.  ఉప్పు  కలిపిన చల్లని మజ్జిగ లేదా కొబ్బరినీళ్లు,  ఓ.ఆర్.ఎస్.  ద్రావణం  తాగించాలి.   ప్రథమ చికిత్స చేసినప్పటికీ  వ్యక్తి  కోలుకోలేకపోతే   దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి  లేదా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి.   అత్యవసర  సేవల కోసం 108కి ఫోన్  చేయాలి. ముందు జాగ్రత్తలతో  వడదెబ్బ నివారణ  సాధ్యమే. 

చేయవలసినవి (నివారణ): ఎండ తీవ్రత తక్కువగా ఉన్న  సమయాలలోనే (ఉదయం 11 గంటల లోపు,  సాయంత్రం నాలుగు గంటల తర్వాత) ఆరుబయట చేయాల్సిన  పనులు చేయాలి.  తలకు టోపీగాని  రుమాలు లేదా టవల్  ధరించాలి.  లేదా  గొడుగును   తప్పక  ఉపయోగించాలి.   వీలైనంతవరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి.  ద్విచక్ర వాహనదారులు  ప్రయాణంలో తలకు హెల్మెట్ ధరించాలి.  లేదా  మెత్తని టవల్  చెవుల పైనుంచి చుట్టుకోవాలి. ఉప్పు  కలిపిన మజ్జిగ,  పల్చని  జావ,  కొబ్బరి బొండాం,  ఓ.ఆర్.ఎస్.  ద్రావణం వంటి  ద్రవపదార్థాలు  అధికంగా తీసుకోవాలి.  తాజా పండ్లు,   కీరదోస,  పుచ్చకాయ,  ముల్లంగి,  నానబెట్టిన  సబ్జా గింజలు చాలా మంచిది.  అన్నింటికీ మించి  ప్రతిరోజూ కనీసం 3 నుంచి 5 లీటర్ల  నీటిని తాగడం మంచిది.

చేయకూడనివి: ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటి పనులు చేయడం, తిరగడం, పిల్లలు ఆడటం చేయరాదు.  నేరుగా ఎండకు,  వేడి గాలులకు గురికాకూడదు.  ముదురు  నలుపురంగు,  మందంగా ఉండే దుస్తులు ధరించరాదు. తలపై  టోపి లేదా టవల్ / రుమాల్  లేకుండా ఎండలో తిరగరాదు.  మత్తుపానీయాలు (మద్యపానం) సేవించవద్దు.  అవి  శరీర  ఉష్ణోగ్రతను  పెంచుతాయి.  శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్) కూడా  తాగవద్దు.  ఎందుకంటే అవి డీహైడ్రేషన్​నుపెంచుతాయి.  నూనె,  కొవ్వు,  మసాలతో  కూడిన ఆహార  పదార్థాలను  వీలైనంత వరకు  తగ్గించాలి.  ప్రత్యేకించి  పదేళ్లలోపు పిల్లలు,  65 ఏళ్లు దాటిన వృద్ధులు  ఎండలో  తిరగకూడదు.  చిన్నారులు, వృద్దులూ అప్రమత్తంగా ఉండాలి. 

చర్మం సాధారణ ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెల్సియస్ నుంచి 34 డిగ్రీల సెల్సియస్ (89. 6 డిగ్రీ ఫారెన్ హీట్ నుంచి 93.2 డిగ్రీల ఫారెన్ హీట్ ) ఉంటుంది.   బయటి  ఉష్ణోగ్రత  ఈ నార్మల్ ఉష్ణోగ్రత కంటే  ఎక్కువైనప్పుడు చర్మం స్వేద గ్రంధుల ద్వారా చాలా చెమటని ఉత్పత్తి చేసి శరీరం చల్లగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది.  వృద్ధుల్లో  దీర్ఘకాలిక రుగ్మతలు,  వయసు మీరిన ఇతర కారణాల వల్ల స్వేదగ్రంధులు సక్రమంగా పనిచేయక, శరీర ఉష్ణోగ్రతను  నియంత్రించలేకపోవడంతో ఎక్కువగా ఈ వయసువారు వడదెబ్బకు గురయ్యే  అవకాశముంది.  అలాగే  చిన్నపిల్లలు  కూడా వడదెబ్బ లేదా  డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఎక్కువ.  అందువల్ల చిన్నారులు, వృద్ధులు ఎండ తీవ్రత  ఉన్న  సమయంలో  బయటకి  వెళ్లకపోవడం చాలా మంచిది.

రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలి
ప్రతి ఏటా ఎండ  తీవ్రత  పెరుగుతోంది. ‘వడదెబ్బ ప్రమాదకరం. జాగ్రత్తలతో నివారణ సాధ్యం’ అనే థీమ్​తో  ప్రభుత్వ  వైద్య ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో  రైతులకు, కూలీలకు వడదెబ్బ గురించి  అవగాహన కల్పిస్తున్నారు.  అదేవిధంగా  తల్లులకు, ఉపాధి హామీ కూలీలకు వడ దెబ్బ లక్షణాలను, వారు తీసుకోవలసిన  ముందస్తు జాగ్రత్తలపై  ఆరోగ్య అవగాహన సమావేశాలు నిర్వహించి విస్తృతంగా వైద్య సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. విద్యావంతులు వడదెబ్బ పట్ల ప్రజల్ని అప్రమత్తం  చేయాలి.

అన్ని గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాల్లో, బస్టాండులలో, మహిళా సంఘం లీడర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలైన  ఓ.ఆర్.ఎస్. డిపో హోల్డర్ల  వద్ద  తగినంత స్టాకు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ఓ.ఆర్.ఎస్. ద్రావణం  ప్రత్యేక  ప్రాణరక్షక పానీయం. దీన్ని ఏ విధంగా తయారు  చేసుకుని తాగాలో ప్రత్యక్షంగా చేసి క్షేత్రస్థాయిలో రైతులకు, కూలీలకు చూపించడం జరుగుతోంది. వేసవి తాపం పెరుగుతున్నందున నిర్లక్ష్యం వహించకుండా తగిన ముందు జాగ్రత్తలను  తీసుకోవడం  ద్వారా   వడదెబ్బను నివారించవచ్చని గుర్తుంచుకోవాలి. 

నాశబోయిన నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

* రచన 700 పదాలకు మించరాదు.