యుద్ధం ఇంకా ముగియలేదు : బండి సంజయ్

యుద్ధం ఇంకా ముగియలేదు : బండి సంజయ్
  • ఆపరేషన్ సిందూర్​తో మన సత్తా చాటాం: బండి సంజయ్
  • టెర్రరిస్టుల అంతు చూసేందుకు ఆర్మీ రెడీగా ఉన్నది
  • తిరంగా ర్యాలీకి హాజరు

కరీంనగర్, వెలుగు: పాకిస్తాన్​తో యుద్ధం ఇంకా ముగియలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశానికి ఆపద వస్తే టెర్రరిస్టుల అంతు చూసేందుకు మన సైన్యం రెడీగా ఉన్నదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్​తో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్​లో సోమవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. గీతాభవన్ చౌరస్తా నుంచి రాంనగర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. 

వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు జాతీయ జెండా పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ‘‘పహల్గాంలో అమాయకులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి చంపేశారు. ప్రధాని మోదీ ఆదేశాలతో మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్​లోని టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేసింది. వంద మంది టెర్రరిస్టులు చనిపోయారు. మోదీ నాయకత్వం చూసి యావత్ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఎన్నో విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ టాప్ 5 దేశాల సరసనన ఇండియాను నిలిపిన ఘనత మోదీది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగడం నా అదృష్టం. ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలను కళ్లారా చూశాను. మన సైనికులను చూసి గర్విస్తున్నాను’’అని బండి సంజయ్ అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, తదితరులు పాల్గొన్నారు.