శ్రీవారి మెట్టు మార్గంలో భద్రతను పెంచుతాం: ఈవో ధర్మారెడ్డి

శ్రీవారి మెట్టు మార్గంలో భద్రతను పెంచుతాం: ఈవో ధర్మారెడ్డి

తిరుమలకు కాలినడకన వచ్చే భక్తలు వన్య ప్రాణులతో ఇబ్బందులు పడుతున్నారు.  అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.  అన్నమయ్య భవనంలో  టీటీడీ, అటవీ పోలీస్ అధికారులతో ఈవో అత్యవసర సమావేశం నిర్వహించారు.    నడకమార్గంలో 500 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నడక మార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేసేందుకు సమగ్ర నివేదిక అందించాలని డి.ఎఫ్.ఓ ను ఆదేశించారు.రెండు నడక మార్గాల్లో ఫారెస్టు, పోలీస్, టీటీడీ కలిసి మరింత ఎక్కువ మందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. 100 మంది భక్తుల గుంపునకు సెక్యూరిటి సిబ్బందిని ఏర్పాటు చేసి అనుమతించనున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వుండేందుకు, త్వరలో అటవీ శాఖ అధికారులు అందించే నివేదిక ఆధారంగా పటిష్టమైన భద్రత చర్యలు చేపడతామని.. చిన్నపిల్లలతో నడక మార్గాల్లో వచ్చే తల్లితండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఈవో విజ్ఞప్తి చేశారు.చిరుత దాడి ఘటనపై సిసిఎఫ్ నాగేశ్వరరావు అధ్వర్యంలో సీన్ రీకనస్ట్రక్సన్ చేయించి, చిరుతను బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నడకదారిలో ఇప్పటికే 30 మంది టీటీడీ భద్రత సిబ్బంది, 10 మంది ఫారెస్ట్ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. 

తిరుమలలో ఆదివారం ( ఆగస్టు 13)  భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ( ఆగస్టు 12)  శ్రీవారిని 82 వేల 265 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీవారికి 41 వేల 300 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.