తిరుమలలో మరో కొత్త ప్రాజెక్ట్ ... శాటిలైట్ కిచెన్.. రిలయన్స్ సహకారం

తిరుమలలో మరో  కొత్త ప్రాజెక్ట్ ... శాటిలైట్ కిచెన్.. రిలయన్స్ సహకారం
  • తిరుమలలో మరో చారిత్రాత్మక ప్రాజెక్ట్...
  • శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి ముఖేష్ అంబానీ చేయూత...
  • సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మాణం....
  • సుమారు 2 లక్షల మందికి అన్న ప్రసాదాలు అందించడమే లక్ష్యం....
  • తిరుమలలో 1985లో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం.... 
  • 1994లో శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా ఏర్పాటు... 

తిరుమలలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్డుకు టీటీడీ శ్రీకారం‌ చుట్టింది.  మరో 30 ఏళ్ళపాటు భక్తుల అవసరాలకు సరిపడా అన్నప్రసాదాలు అందించే శాటిలైట్ కిచెన్ గురించి .. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన ముకేశ్ అంబానీకి టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ గురించి వివరించారు. 

తిరుమలలో భక్తుల కోసం మరో చారిత్రక కట్టడానికి తొలి అడుగు వేసింది టీటీడీ. ఇందులో అత్యాధునిక అన్నప్రసాద కేంద్రాన్ని నిర్మించడంలో  రిలయన్స్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషించనుంది. సుమారు రూ.100 కోట్లకు పైగా అంచనాలతో నిర్మించనున్న ఈ కేంద్రానికి ముకేశ్ అంబానీ ఆర్థిక సహాయం అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో కూడిన ఈ కిచెన్, రోజుకు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి  తెలిపారు. ఈ విషయాన్ని తిరుమల పర్యటనకు వచ్చిన ముకేశ్ అంబానీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శాటిలైట్ కిచెన్ ను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నామని ఫౌండేషన్ వెల్లడించింది. ఏపీ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేస్తున్నారు. 

తిరుమలలో ఆకలి అనే పదానికి తావు లేదు. ఎంతమంది వచ్చిన ఫరవాలేదు. వారందరికీ నాణ్యమైన అన్నప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. నిత్య కల్యాణం పచ్చ తోరణంగా ఉన్న తిరుమలకు నిత్యం‌ లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.  వెంకన్న దర్శనం‌ అనంతరం ఒక్క పూట అయినా, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్నప్రసాదాలు స్వీకరించాలని భక్తులు భావిస్తారు.  

శ్రీనివాసుడి సన్నిధిలో అన్నదానం అన్నది గొప్ప పుణ్యకార్యక్రమం. ఇప్పటికే ఈ ట్రస్టుకు రూ.2,300 కోట్లు డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. ఈ మొత్తం మీద వచ్చే వడ్డీతోనే ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం అన్నదానం కార్యక్రమం 1985లో ప్రారంభమై... 1994లో అన్నప్రసాదం ట్రస్టుగా ఏర్పడింది. 2020 వరకు అన్నదాన కార్యక్రమం నడవడానికి టీటీడీ గ్రాంట్ ఇస్తూ వచ్చింది.. ఆ తర్వాత స్వయం సమృద్ధిని సాధించి, భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు అందిస్తోంది టిటిడి. ఈ ట్రస్టుకు ప్రతి ఏటా విరాళాలు పెరుగుతూ వస్తున్నాయి, కార్పస్ నిధులు, వాటి వడ్డీలు గణనీయంగా పెరుగుతూ వడ్డికాసులవాడి సంపద కొండలా పెరుగుతోంది. 

  • 2023-24లో కార్పస్ రూ.1854 కోట్లు
  •  2024-25లో రూ.2127 కోట్లు
  •  2025 ఆగస్టు వరకు రూ.2263 కోట్లు

 ప్రస్తుతం 2300 కోట్లకు పైగా చేరింది.  వడ్డీలు రూపంలో 2024లో రూ.221 కోట్లు, 2025లో రూ.270 కోట్లకు పెరిగింది, ప్రస్తుతం వార్షిక వ్యయం రూ.150 కోట్లు ఉంది. రూ.కోటి విరాళాలు ఇచ్చేవారు కూడా పెరిగారు.. 2023-24లో 14 మంది ఉంటే, 2024-25లో 25 మంది, ఈ ఏడాది ఐదు నెలల్లోనే 14 మంది రూ.కోటి పైగా విరాళం అందజేశారు. గత నాలుగు దశాబ్దాలుగా టీటీడీ భక్తులకు అందిస్తున్న విశ్వసనీయ సేవలతో భక్తులు విశేషంగా విరాళాలు అందజేస్తున్నారు... 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని నిర్మించాలని టీటీడీ యోచిస్తున్నట్లు వివరించారు. వెంటనే ఈ ప్రాజెక్టు అయ్యే ఖర్చు మొత్తాన్ని రిలయన్స్ ఫౌండేషన్‌ డోనెట్ చేస్తుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు. 

టీటీడీ శాటిలైట్ కిచెన్  ప్రాజెక్టులో టీటీడీ..  ఏపీ ప్రభుత్వంతో కలిసి పాలుపంచుకుంటున్నందుకు తాము సంతోషిస్తున్నామని రిలయన్స్ సంస్థ తెలిపింది. ఈ కొత్త శాటిలైట్ కిచెన్ అందుబాటులోకి వస్తే, తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. రాబోయే మరో 30 సంవత్సరాల పాటు భక్తుల రద్దీకి తగ్గట్టు ఈ ప్రాజెక్టు ను రూపొందించింది టిటిడి.  ప్రతిరోజూ దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందించేలా దీనిని డిజైన్ చేశారు. 

ఆధునిక కిచెన్, ఏఐ టెక్నాలజీల వాడకం వల్ల అన్నప్రసాద తయారీ ప్రక్రియ మరింత సమర్థవంతంగా మారనుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఈ ప్రాజెక్టుకు చేయూతనివ్వడం ద్వారా భక్తుల సేవలో టీటీడీకి అండగా ఉంటుంది.