
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆదివారం ( సెప్టెంబర్ 7) 12 గంటల పాటు మూసివేయనున్నట్లు టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. ఆలయంలో సుమారు 15 గంటల పాటు దర్శనాలు ఉండవని ఆయన తెలిపారు. భక్తులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుని టిటిడి కి సహకరించాలని కోరారు.
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7 వ తేది మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సోమవారం తెల్లవారు జామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయునున్నారు. చంద్రగ్రహణం రాత్రి 9:50 నుంచి సోమవారం వేకువజామున ఒంటిగంట 31 నిమిషాల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగమశాస్త్ర సాంప్రదాయాలను అనుసరించి 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయ ద్వారాలను మూసి వేయనున్నారు.
గ్రహణం వీడిన అనంతరం సోమవారం ఉదయం 3 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి ముందుగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి ఏకాంతంగా సుప్రభాత, తోమాల, అర్చన సేవలు నిర్వహించి నైవేద్య సమర్పిస్తారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్ 7 వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను రద్దు చేసింది. అలాగే సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనలను రద్దు చేశారు.
అన్న ప్రసాద సముదాయాన్ని మధ్యాహ్నం మూడు గంటల నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు మూసివేయనున్నారు. మరోవైపు భక్తులకు ఇబ్బంది పడకుండా టీటీడీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 50 వేల ఆహార పొట్లాలను ముందస్తుగానే సిద్ధం చేసి సాయంత్రం నాలుగున్నర గంటలకు భక్తుల రద్దీ ప్రాంతాలలో పంపిణీ చేయనున్నారు. గ్రహణం కారణంగా 12 గంటల పాటు ఆలయ ద్వారాలు మూసివేస్తుండడం.. 15 గంటల పాటు దర్శనాలు నిలిపివేస్తున్న నేపథ్యంలో తిరుమల విచ్చేసిన భక్తులు అందుకు అనుగుణంగా తమ పర్యటనను ప్రణాళికలు వేసుకోవాలని టీడీడీ అధికారులు శ్రీవారి భక్తులకు సూచిస్తున్నారు.