గోవింద రాజ స్వామి కిరీటాలు చోరీ చేసిన దొంగ అరెస్ట్

గోవింద రాజ స్వామి కిరీటాలు చోరీ చేసిన దొంగ అరెస్ట్
  • సీసీ కెమరాల ఆధారంగా నిందితుడు గుర్తింపు
  • 80 రోజులపాటు నిఘా వేసి పట్టుకున్న స్పెషల్ టీమ్
  • రేణిగుంటలోనే పట్టుబడ్డ నిందితుడు

రెండు నెలల క్రితం తిరుపతిలోని గోవింద రాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు చోరీకి గురైన సంగతి తెలిసింది. తాజాగా ఈ కేసులో పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేశారు. తిరుపతి ఎస్పీ అన్బురాజన్‌ ఈ విషయాన్ని  ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు.  నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాకు చెందిన ఆకాశ్‌ ప్రకాశ్‌ అని ఆయన చెప్పారు. నిందితుడి నుంచి బంగారు కడ్డీలు, ఒక ఐఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.  చోరీ చేసిన 3 కిరీటాలను బంగారం వ్యాపారుల సాయంతో  కరిగించి వాటిని బంగారు కడ్డీలుగా మార్చాడని ఆయన తెలిపారు. చోరీకి గురైన 3 కిరీటాల బరువు 1381 గ్రాములని, వాటి విలువ సుమారు రూ.42 లక్షల 35 వేలని చెప్పారు. చోరీ జరిగిన 80 రోజుల తర్వాత నిందితుడిని పట్టుకున్నట్లు వివరించారు.

సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని ఎస్పీ తెలిపారు. నిందితుడు దొంగతనం చేశాక రేణిగుంట, కాచిగూడ, మహారాష్ట్రల్లో స్థానికంగా ఉన్న బంగారు వ్యాపారుల వద్ద అమ్మటానికి ప్రయత్నించి విఫలమయ్యాడని వివరించారు. గుడిలో ఉన్న సీసీ కెమెరా,  ఓ వైన్‌షాప్‌ వద్ద ఉన్న సీసీ కెమెరా, ఆ తర్వాత  రేణిగుంట రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలో నిందితుడు కనపడ్డానని ఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి  స్పెషల్  టీంలను ఏర్పాటు చేశామని, అతని కదలికల ఆధారంగా వివిధ ప్రాంతాలకు టీంలను పంపి చివరకు రేణిగుంటలోనే పట్టుకున్నామని చెప్పారు. మహారాష్ట్రకు పరారైన నిందితుడు తిరిగి రేణిగుంటకే వచ్చి, అదే ప్రాంతంలో సంచరిస్తుండడంతో అతనిపై నిఘా వేసి పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ కేసును చేదించిన పోలీసు సిబ్బందికి అభినందనలతో పాటు రివార్డును కూడా ప్రకటించారు ఎస్పీ అన్బురాజన్‌.