
బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ (Kriti Sanon) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా, అవార్డులు ప్రశంసలు సైతం అందుకుంటుంది. ఇటీవలే, ప్రపంచంలోని టాప్ 10 అందమైన హీరోయిన్స్‌లో ఒకరిగా నిలిచి సత్తా చాటింది. IMDBసంస్థ రిలీజ్ చేసిన లిస్ట్లో ఆమె ఐదో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే.. లేటెస్ట్గా కృతిసనన్ పేరు మరోసారి బాలీవుడ్ వర్గాల్లో మార్మోగుతుంది. ఈ బ్యూటీ ముంబైలోని బాంద్రాలో ఓ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ లగ్జరీ ఇల్లు కోసం ఏకంగా రూ.78 కోట్లు ఖర్చు చేసిందట. అంతేకాదు.. ఒక్కో చదరపు అడుగుకు (Square Foot) ఏకంగా రూ.లక్షపైనే ఖర్చు చేసి ఈ డ్యూప్లెక్స్ పెంట్ హౌస్‌ను సొంతం చేసుకుందని సమాచారం.
మొత్తం 6,636 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌస్లో ఆరు పార్కింగ్ స్థలాలు మరియు ఒక టెర్రస్ ఉన్నాయట. ఈ లగ్జరీ కొనుగోలుపై కృతి సనన్ రూ.3.91 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం విశేషం. ఇది 14వ మరియు 15వ అంతస్తులలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, కృతి ముంబైలోని అంధేరిలో ఉన్న ఒక పెద్ద అద్దె అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది, ఆమె తన సోదరి నూపుర్తో కలిసి ఉంటుంది.
కృతిసనన్ ఇటీవలే.. ఓ ఖరీదైన ప్లాట్ కొనుగోలు చేసింది. ఇది మహారాష్ట్రలోని ప్రముఖ బీచ్ టౌన్ అయిన అలీబాగ్ లో ఉంది. రెండు వేల చదరపు అడుగుల ఈ ప్లాట్ కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇదే ప్రాంతంలో చాలా మంది బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలకు ఆస్తులు ఉన్నాయి. కృతి సనన్ ఒక్కో సినిమాకు సుమారుగా రూ.5 కోట్ల లోపు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్.
కృతి సనన్ సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంతితో తెరంగేట్రం చేసింది. తెలుగులో నాగ చైతన్యతో దోచేయ్, ప్రభాస్ సరసన ఆది పురుష్ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్కు దగ్గరైంది. ప్రస్తుతం ఆమె ‘తేరే ఇష్క్ మే’చిత్రంలో నటిస్తోంది. అలాగే కాక్ టైల్ 2, డాన్ 3 చిత్రాల్లోనూ హీరోయిన్‌గా తన పేరు వినిపిస్తోంది.