తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగుతాయి. ఈ ఏడాది జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వస్తున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరు ఆస్థానమండంలో మంగళవారం ( నవంబర్ 11) బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ CVSO కే. వి. మురళీకృష్ణ లతో కలసి సమీక్ష నిర్వహించారు.
తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ఇప్పటికే ఎస్పీ, టిటిడి సివిఎస్వో, టిటిడి జేఈవో సమీక్ష నిర్వహించారని ఈవో తెలిపారు. ఉత్సవాల సమయంలో తిరుచానూరు ఆలయం పరిసరాలలోను, పద్మసరోవరం, హోల్డింగ్ పాయింట్లు దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. . పంచమి తీర్థం రోజు దాదాపు 75 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు అన్నప్రసాదాలు సిద్ధం చేసుకోవాలని, పటిష్ట క్యూలైన్లు, జర్మన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులు, వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
రోజువారి 10 వేల మందికి అన్నప్రసాదాలు.. పంచమి తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్లలో దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు వేచియుండే అవకాశం ఉందన్నారు. తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపడుతారన్నారు..
