అమెరికాపై మనమూ.. 50 శాతం టారిఫ్ లు వేయాలి:శశిథరూర్

అమెరికాపై మనమూ.. 50 శాతం టారిఫ్ లు వేయాలి:శశిథరూర్
  •     కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సూచన

న్యూఢిల్లీ: అమెరికాపై భారత్  కూడా 50  శాతం ప్రతీకార సుంకాలు వేయాలని కాంగ్రెస్  ఎంపీ శశిథరూర్  సూచించారు. అలాగే, అమెరికా బదులు ప్రత్యామ్నాయ మార్కెట్  గురించి ఆలోచించాలన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో థరూర్  మాట్లాడారు. భారత్ పై టారిఫ్ లను 50  శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. 

ట్రంప్  వైఖరిని తప్పుపట్టారు. ట్రంప్  దుందుడుగు స్వభావంతో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ట్రంప్  నిర్ణయం కరెక్టు కాదు. ఆయన ప్రకటన పూర్తిగా అన్యాయం, అసంబద్ధం, అసమంజసం. చైనాతో పాటు చాలా యూరోపియన్  దేశాలు కూడా రష్యా నుంచి ఆయిల్, తదితర ఉత్పత్తులు కొంటున్నాయి. అయినా కూడా ఏ అమెరికా భాగస్వామ్య దేశంపైనా 50 శాతం సుంకాలు వేయలేదు. ఒక్క ఇండియా మీదే అన్ని పన్నులు వేశాడు. మనం కూడా అమెరికాపై 50 శాతం టారిఫ్ లు విధించాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బే కరెక్టు” అని శశి థరూర్  వ్యాఖ్యానించారు.