
‘బిగ్ బాస్’ ఫేమ్ అమరదీప్ చౌదరి, నటి సురేఖ వాణి కూతురు సుప్రీతా హీరో హీరోయిన్‌గా మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న చిత్రం ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’. సోమవారం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అమరదీప్ మాట్లాడుతూ ‘బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమా ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు. చక్కగా ప్లాన్ చేసుకుని మంచి సినిమాతో రావాలని అనుకున్నాను.
అది కుదరడానికి ఇంత సమయం పట్టింది. ఈ టైటిల్‌తో పాటు సినిమా కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉందని సుప్రీతా చెప్పింది. నిర్మాత మహేంద్రనాథ్ మాట్లాడుతూ ‘ఇందులో సీనియర్ నటులు రాశి, వినోద్ కుమార్, సురేఖ వాణి, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’ అని అన్నారు.