సీఎం కేసీఆర్ మాటలకు భయపడే ప్రసక్తే లేదని చార్మినార్ డివిజన్ ఆర్టీసీ జేఏసీ నాయకులు శంకర్, టీకే రావు, జమీర్ తెలిపారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా సోమవారం ఫలక్‌నుమా డిపో కార్మికులు ఏర్పాటు చేసిన నిరసన, ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువును లెక్కచేయమని, తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించే వరకూ సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు.
ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోన్న ప్రభుత్వం
మహేశ్వరం: ఆర్టీసీని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ డ్యూటీలో చేరమని ప్రతిజ్ఞ చేశారు. డిపో ఎదుట వంటావార్పు నిర్వహించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
చందానగర్‌లో నిరసన
చందానగర్: మియాపూర్ డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకుడు వినాయక్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు.
ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునేందుకు కుట్ర
తాండూరు: ఆర్టీసీకి చెందిన వేల కోట్ల విలువైన ఆస్తులను తన అనయాయులకు కట్టబెట్టేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రాజకీయ విపక్షాలు ధ్వజమెత్తాయి. తాండూరు డిపో ఆవరణలో సోమవారం నిరాహార దీక్షలు చేపట్టారు. టీజేఎస్ ఇన్చార్జి సోమశేఖర్, బీజేపీ నేతలు భద్రేశ్వర్, కృష్ణ ముదిరాజ్, సుదర్శన్‌గౌడ్, సీపీఐ నేత శ్రీనివాస్ తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు.
కార్మికులను ఆగం చేస్తున్న కేసీఆర్
పరిగి: ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని కార్మికులను ఆగం చేస్తున్నారని తెలంగాణ ఇంటి పార్టీ జిల్లా అధ్యక్షుడు రామన్నమాదిగి విమర్శించారు. పరిగి హైవేపై బైఠాయించి కార్మికులు, నాయకులు ధర్నా చేశారు.
దీక్షలకు విపక్షాల మద్దతు
షాద్ నగర్: ఆర్టీసీ రిలే నిరాహార దీక్షలకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. సోమవారం దీక్ష శిబిరంలో బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వీర్లపల్లి శంకర్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
జీడిమెట్లలో అర్ధనగ్న ప్రదర్శన
జీడిమెట్ల: ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ జీడిమెట్ల ఆర్టీసీ కార్మికులు, బీజేపీ, సీపీఎం నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జీడిమెట్ల బస్ డిపో నుంచి షాపూర్‌నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, సీపీఎం జిల్లా నాయకుడు కీలుకాని లక్ష్మణ్, జేఏసీ నాయకుడు రాజు పాల్గొన్నారు.
నియంతలా వ్యవహరిస్తున్న సీఎం
రాజేంద్రనగర్: నెల రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపకుండా సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని జేఏసీ నేతలు అన్నారు. జేఏసీ సూచనలిచ్చేంత వరకు ఎవరూ విధులో చేరబోమని రాజేంద్రనగర్ డిపో వద్ద కార్మికులు ప్రతిజ్ఞ చేశారు.
జన సమితి పార్టీ బస్తీబాట
ముషీరాబాద్: సమ్మెకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మద్దతు పలకాలని తెలంగాణ జన సమితి నగరాధ్యక్షుడు ఎం నరసయ్య విజ్ఞప్తి చేశారు. జన సమితి పార్టీ నగర అధ్యక్షుడు నరసయ్య, ముషీరాబాద్ ఇన్చార్జి మెరుగు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో దోమలగూడ, బీమా మైదానం, అశోక్ నగర్, ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతాలలో బస్తీబాట నిర్వహించారు. అజయ్ గౌడ్, రవీందర్ యాదవ్, వెంకటయ్య, సుధాకర్ పాల్గొన్నారు.
సమ్మె కొనసాగిస్తాం: జేఏసీ కన్వీనర్
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ జీఆర్ చందర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులుబైఠాయించి ధర్నా నిర్వహించారు.

