టీఎంసీ ఆఫీసుపైకి బుల్డోజర్లు..కోల్ కతాలో హైటెన్షన్

టీఎంసీ ఆఫీసుపైకి బుల్డోజర్లు..కోల్ కతాలో హైటెన్షన్

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.  ఫలితాల ప్రభావంతో పలుప్రాంతాల్లో భాజపా,తృణమూల్‌ వర్గాల మధ్య గొడవలు చెలరేగి ఉద్రిక్తత పెరిగింది.దీంతో మంగళవారం రాత్రి కోల్ కతాలోని న్యూ మార్కెట్ టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. మార్కెట్లోని బుల్డోజర్లతో టీఎంసీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే  ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా ఈఘటన జరగడంతో అక్కడి వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.పరిస్థితి విషమించవచ్చనే ఆందోళనతో దుకాణాలు మూసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.బీజేపీ విధ్వంసానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ నేతలు సోషల్ మీడియాల్లో  పోస్ట్ చేశారు. కోల్ కతాలోని న్యూ మార్కెట్ ప్రాంతాన్ని, టీఎంసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. బీజేపీ పరివర్తన్ అంటే ఇదేనా అంటూ టీఎంసీ నేతలు ప్రశ్నించారు. 

వీడియోలో పెద్ద ఎత్తున కేకలు, మ్యూజిక్ మధ్య ఒక బుల్డోజర్ ఆ ప్రాంతంలోని ఒక దుకాణాన్ని కూల్చివేస్తున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. బీజేపీ 'పరిబోర్తన్' నినాదాన్ని ఎద్దేవా చేస్తూ మార్పు బుల్డోజర్‌తో వచ్చిందని టీఎంసీ రాసింది. ‘‘ బీజేపీ  పరిబోర్తన్ వచ్చేసింది..అది కూడా బుల్డోజర్‌తో పాటు..గూండాయిజానికి పాల్పడుతూ న్యూ మార్కెట్ ప్రాంతం సమీపంలో బీభత్సం సృష్టించారు. దుకాణాలను ధ్వంసం చేసి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. విశ్వాసం గురించి మాట్లాడి, భయోత్పాతాన్ని సృష్టించిన పార్టీ జరుపుకుంటున్న వేడుక ఇది" అని టీఎంసీ ఆ పోస్ట్‌లో రాసింది.

ప్రధాని, మోదీ, అమిత్ షాలపై  తీవ్రంగా మండిపడ్డారు. వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించేందుకు, ప్రత్యర్తులను చంపేందుకు లైసెన్స్ ఇచ్చారని  టీఎంసీ నేతలు ఆరోపించారు.  బీజేపీ కార్యకర్తలకు సహకరించేలా కేంద్ర బలగాలకు ఆదేశాలు జారీ చేశారని  విమర్శించారు. ఇవాళ దుకాణాలు, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారు.. రేపు బెంగాల్ ప్రముఖలు విగ్రహాలు, పేదలు, బలహీన వర్గాల ఇండ్లను కూడా ధ్వంసం చేస్తారని  అన్నారు.  బీజేపీ బుల్డోజర్ విధ్వంసాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.