భట్టాచార్యపై ఈడీ ప్రశ్నల వర్షం

భట్టాచార్యపై ఈడీ ప్రశ్నల వర్షం

పశ్చిమ బెంగాల్లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ప్రమేయమున్న వారి భరతం పడుతోంది. ఇప్పటికే పార్థచటర్జీని అరెస్ట్ చేసి కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసులో సంబంధం ఉన్న మరో టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇటీవల భట్టాచార్య నివాసంలో నిర్వహించిన దాడుల్లో టీచర్ నియామాకల కుంభకోణంకు సంబంధించి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు బెంగాల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ప్రెసిడెంట్ పదవి నుంచి భట్టాచార్యను తొలగించారు. ఈ పత్రాలకు సంబంధించి భట్టాచార్యను అధికారులు ప్రశ్నిస్తున్నారు.  పార్థచటర్జీని అరెస్ట్ చేసిన తర్వాత భట్టాచార్యకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఈడీ ముందు హాజరయ్యారు. 

ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల స్కామ్‌ కేసు దర్యాప్తు వేళ తన ఇంట్లోంచిఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు అంతా నాటి బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీదేనని నిందితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు. ఈడీ కస్టడీలో విచారణలో ఆమె ఈ విషయం వెల్లడించారు.  ఈడీ సోదాల్లో ఆర్పిత ఇంట్లో రూ.21 కోట్లకుపైగా కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన లావాదేవీల కోసం వారు 12 నకిలీ సంస్థలను నడుపుతున్నట్లు ఈడీ ఉన్నతాధికారి వెల్లడించారు

అర్పిత, పార్థా ఉమ్మడిగా ఒక ఆస్తిని కొనుగోలుచేయగా, సంబంధిత డాక్యుమెంట్‌ను ఈడీ స్వాధీనంచేసుకుంది. గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ తరగతి ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు, తుది ఫలితాలు, అపాయిమెంట్‌ లెటర్స్‌ తదితర పత్రాలూ అర్పిత ఫ్లాట్‌లో దొరికాయి. కాగా మంత్రి పార్థచటర్జీని, అర్పితలను ఆగస్ట్‌ మూడో తేదీ దాకా ఈడీ కస్టడీలోకి అప్పజెప్తూ ఈడీ కోర్టు ఆదేశాలిచ్చింది.