మా రాష్ట్రానికి మేమొస్తం..కొత్త సర్కారుకు ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల మొర

మా రాష్ట్రానికి మేమొస్తం..కొత్త సర్కారుకు ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల మొర
  •     ఏపీ ప్రభుత్వంగ్రీన్ సిగ్నల్ ఇచ్చినా..ఏండ్లుగా అక్కడే విధులు
  •     ఇటీవల డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన ఉద్యోగ సంఘ నేతలు

హైదరాబాద్, వెలుగు : ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు సొంత రాష్ట్రానికి వచ్చేందుకు ఏండ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పాలనా పగ్గాలు చేతబట్టడంతో తమను సొంత రాష్ట్రానికి తీసుకోవాలని కోరుతున్నారు. తమను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించినా, గత ప్రభుత్వం తీసుకువచ్చేందుకు చొరవ చూపలేదని, కొత్త సర్కారైనా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల తరఫున టీఎన్జీవో నేతలు శ్రీరామ్

విఠల్ బాబులు డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్కను కలిసి సమస్యను వివరించారు. 9 ఏళ్లుగా ఏపీలో మన ఉద్యోగులు ఎంతో గోస పడుతున్నామని ఆయనకు తెలిపారు. ఈ సమస్యపై మంత్రి స్పందిస్తూ ఇది న్యాయమైన డిమాండ్ అని సీఎంతో మాట్లాడి సమస్యను పరష్కరిస్తామని భట్టి హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.

ఆగిన అంతరాష్ర్ట బదిలీలు..

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆప్సన్స్ ఇవ్వని ప్రభుత్వ జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ప్రభుత్వ ఉద్యోగులను వారు కోరుకున్న రాష్ర్టాలకు బదిలీ చేయాలన్న అప్లికేషన్లు పెండింగ్ లో పడిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో  తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాళ్లు అన్ని శాఖల హెచ్ వోడీలకు ఆప్షన్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తామని1808 మంది అప్లికేషన్ పెట్టుకోగా, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తామని1396 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఈ ఫైల్స్ ఏడాదిన్నర నుంచి పెండింగ్ లో ఉన్నాయి.

ఈ సమస్యను పరిష్కరించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల సీఎం రేవంత్ కు లేఖ రాశారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారు మొదట్లో120 మందికి పైగా ఉండగా కరోనా, అనారోగ్య కారణాల వల్ల చాలా మంది మరణించారు. ఇప్పుడు 84 మంది ఉద్యోగులు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కొత్త సర్కారు పరిష్కరించాలి

మాది సికింద్రాబాద్. రాష్ర్ట విభజన సమయంలో జూనియర్లనే పేరుతో ఏపీకి కేటాయించారు.అప్పటి నుంచి ఏపీలో పనిచేస్తూ ప్రతి వారం కుటుంబం, పిల్లల కోసం హైదరాబాద్ వస్తూ చాలా ఇబ్బంది పడుతున్న. తెలంగాణకు తీసుకురావాలని గత రెండు ప్రభుత్వాల్లో మంత్రులు, అధికారులను కలిసినం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. మమ్మల్ని రిలీవ్ చేయటానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించినా గత ప్రభుత్వం చొరవ చూపలేదు. కొత్త ప్రభుత్వం మా గురించి ఆలోచించాలి.

- సంగీత, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగి

మా ఫైల్ పక్కన పెట్టారు

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి తీసుకు రావాలని 2014  నుంచి కోరుతున్నం. పలు సార్లు ఉద్యోగ సంఘాల నేతలు అప్పటి సీఎం కేసీఆర్ ను కలిసిన టైమ్ లో విన్నవించారు. ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ అప్పటి సీఎంవో అధికారి మా ఫైల్ పక్కన పెట్టారు.  9 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి.