
- సార్క్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే యోచన
- ఇండియాను కూడా భాగస్వామ్యం చేసే చాన్స్
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు దక్షిణాసియా దేశాలతో కలిసి సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్)కు ప్రత్యామ్నాయంగా కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులోకి భారత్‌ను కూడా ఆహ్వానించే అవకాశం ఉన్నప్పటికీ, భారత్ సానుకూల స్పందించడం అనుమానాస్పదమేనని తెలుస్తున్నది. ఈ మేరకు పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
జూన్ 19న చైనాలోని కున్మింగ్‌లో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, బంగ్లాదేశ్ నాయకుడు మహ్మద్ యూనస్ ప్రతినిధులు ఈ బ్లాక్ ఏర్పాటుపై చర్చించారు. శ్రీలంక, మాల్దీవులు, అఫ్గానిస్తాన్‌లను కూడా భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్‌ను ఆహ్వానించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం స్పందన అనుమానాస్పదమని డిప్లొమాటిక్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
పాక్ చర్యలతో స్తబ్ధుగా సార్క్
సార్క్ 1985లో ఏర్పడినప్పటి నుంచి దక్షిణాసియాలో ప్రాంతీయ సహకారం, ఆర్థిక సమైక్యతను ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేసింది. అయితే, 2016లో భారత్‌లోని ఉరిలో టెర్రరిస్టు ఎటాక్ తర్వాత భారత్, అఫ్గాన్, బంగ్లాదేశ్, భూటాన్‌లు ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సమ్మిట్‌ను బహిష్కరించాయి. 2014 ఖాఠ్మండు సమిట్‌లో పాకిస్తాన్ తన వీటో అధికారంతో మోటార్ వెహికల్ ఒప్పందం వంటి చర్యలను అడ్డుకుంది.
దీంతో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లు బీబీఐఎన్ ఒప్పందంతో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయి. చైనా, పాకిస్తాన్‌లు కొత్త సమూహం ద్వారా ప్రాంతీయ సమైక్యత, కనెక్టివిటీని పెంపొందించాలని భావిస్తున్నాయి.