దళితబంధుకు దళితులైతే చాలు.. పేదోళ్లే కానక్కర్లే!

దళితబంధుకు దళితులైతే చాలు.. పేదోళ్లే కానక్కర్లే!
  • మెడికల్​ షాపుల్లోనూ రిజర్వేషన్లు ఇస్తమన్న మంత్రి హరీశ్​
  • సర్కారు దవాఖాన్లల్ల 16% కాంట్రాక్ట్​ ఏజెన్సీలు ఎస్సీలకు రిజర్వ్​ 

హైదరాబాద్​, వెలుగు: సీఎం కేసీఆర్​ ప్రారంభించిన దళితబంధును ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని, ఆ పథకం అందాలంటే దళితులైతే చాలని, పేదోళ్లే కావాల్సిన అవసరం ఏమీ లేదని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. మెడికల్​​షాపుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నామని చెప్పారు. సర్కారు దవాఖాన్లలో కాంట్రాక్ట్​ ఏజెన్సీలను 16 శాతం ఎస్సీలకు రిజర్వ్​ చేశామని చెప్పారు. మంగళవారం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్​ ఆఫీసులో ఆయన మాట్లాడారు. ఎస్సీలకు 56 ఆసుపత్రుల్లో డైట్​, శానిటేషన్​ కాంట్రాక్టులు ఇస్తామన్నారు. వంద బెడ్ల లోపున్న దవాఖానను ఒక కేటగిరీగా, వంద బెడ్ల కన్నా ఎక్కువున్న ఆసుపత్రిని మరో కేటగిరీగా విభజించామన్నారు. ఎస్సీలకు రిజర్వ్​ చేసే ఆసుపత్రులను డ్రా ద్వారా నిర్ణయించామన్నారు. వీటికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఎస్సీ యువతకు అవకాశాలు దక్కేలా టెండర్ల రూల్స్​ మార్చామన్నారు. సర్కారు దవాఖాన్లలో పరిశుభ్రతను మరింత బాగా చేయడం కోసం ఒక్కో బెడ్​ చార్జీని రూ.5 వేల నుంచి రూ.7,500కు ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. అందుకు ఏటా రూ.325 కోట్లను ప్రభుత్వం అదనంగా ఖర్చు చేస్తుందన్నారు. డైట్​ చార్జీలనూ రెట్టింపు చేశామన్నారు. దళితులు కేవలం కూలీ పనులకు మాత్రమే పరిమితం కావొద్దన్న ఉద్దేశంతో.. సర్కారు కొలువులు, కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్లు ఇచ్చేలా స్వాతంత్ర్యానికి ముందే ప్రభుత్వానికి అంబేద్కర్​ లేఖ రాశారని టీఎస్​ఎంఎస్​ఐడీసీ చైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ అన్నారు.