ఈ ఊళ్ళోకి వెళ్లాలంటే ఐడీ ఉండాల్సిందే

ఈ ఊళ్ళోకి  వెళ్లాలంటే  ఐడీ ఉండాల్సిందే

విదేశాలకు వెళ్లాలంటే పాస్​పోర్ట్​, వీసా ఉండాల్సిందే. అచ్చు అలాగే  కామారెడ్డి జిల్లాలోని పెద్దపొతంగల్​కు  వెళ్లాలంటే ఐడీ కార్డ్​  కంపల్సరీ.  ఐడీ ప్రూఫ్​ లేకపోతే  ఎంతటి వాళ్లైనా వచ్చిన దార్నే  వెనక్కి వెళ్లాల్సిందే. మాట కాదని ఊరి వైపు అడుగేస్తే  జనమంతా ఏకమయ్యి తరిమికొడతారు. ఎందుకలా  అంటారా! దొంగతనాలు, మోసాల నుంచి తమ ఊరిని గట్టెక్కించడానికి.  గత పదేళ్లుగా ఈ కొత్తరకం ఆలోచనతో ముందు కెళ్తున్న ఈ ఊరిపై స్పెషల్​ స్టోరీ.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పొతంగల్​.. మొత్తం 450 ఇళ్లు, 2, 500 జనాభా. పదేళ్ల  క్రితం బాబా వేషంతో ఓ వ్యక్తి ఈ ఊరిలో అడుగుపెట్టాడు. మధ్యాహ్నం అవడంతో దాదాపు ఊళ్లోని ఇళ్లన్నింటికీ తాళాలు వేసి, అంతా పొలం పనుల్లో బిజీ అయ్యారు. ఆ టైంలో ఇంట్లో  ఒంటరిగా ఉన్న  ఓ వ్యక్తిని గమనించి పలకరించాడు బాబా. తాను బాబానని నమ్మించాడు. మీ దగ్గరున్న బంగారాన్ని పూజ చేసి రెట్టింపు చేస్తానని చెప్పాడు. బాబా మాయమాటలు నమ్మి ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న బంగారాన్నంతా ఊడ్చి బాబా ముందు పెట్టాడు. ఆ దొంగ బాబా పూజచేస్తున్నట్టు నమ్మించి బంగారంతో ఉడాయించాడు. తర్వాత ఎంత ప్రయత్నించినా బాబా  ఆచూకీ దొరకలేదు. ఆ ఘటన ఊరి జనాల్ని ఆలోచింపజేసింది. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ ఐడీ ప్రూఫ్​ సిస్టమ్​. గత పదేళ్లుగా  ఊరిలో ఈ సిస్టమ్​ అమలవుతోంది.

ఐడీ చూపించాలి

పెద్ద పొతంగల్​ ఊరి ఎంట్రన్స్​లోనే  పంచాయితీ ఆఫీసు ఉంటుంది. దాని ఎదురుగా పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఉదయం నుంచి రాత్రి వరకు స్థానికులతో పాటు పంచాయితీ స్టాఫ్​ కూర్చొని​ ఉంటారు. కొత్త వ్యక్తి కనిపించగానే  ఎవరని ఆరా తీస్తారు. ఊరు, పేరు  వంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటారు. ఐడీ కార్డు చూపించమంటారు. ఆధార్​, డ్రైవింగ్​ లైసెన్స్, ఓటర్​ కార్డు ఇలా ఏదైనా ఒక కార్డు చూపించాలి. అప్పుడే ఊళ్లో అడుగుపెట్టనిస్తారు.
 ఊళ్లో ఎవరింటికైనా చుట్టాలొచ్చినా కార్డు కంపల్సరీ. పండ్లు, కూరగాయలు, బట్టలు లాంటివి  అమ్మేవాళ్లు  కూడా  ఐడీ కార్డు చూపించాల్సిందే. వాళ్ల వివరాల్ని పంచాయితీ ఆఫీసులో  రాసుకుంటారు  వాళ్ల ఐడీ కార్డు తీసుకుంటారు గ్రామస్తులు.  వస్తువులు అమ్ముకొని తిరిగి వెళ్లేటప్పుడు కార్డు తిరిగిస్తారు.

మోసాలు.. చోరీలు లేవు

ఐడెంటిటీ కార్డు సిస్టమ్​ వల్ల  మోసగాళ్లు, దొంగలు ఈ ఊరిలోకి అడుగుపెట్టలేరు. దాంతో గత పదేళ్లలో మోసాలు, దొంగతనాలు పూర్తిగా తగ్గాయి.  ఈ కొత్త పద్ధతి వల్ల ఊరితో పాటు ఊరి జనాలకు కూడా   మంచి పేరు వచ్చింది.
- వాడికారి గంగాధర్​ , కామారెడ్

అందరి నిర్ణయం ఇది
ఊరంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. ఊరి జనంతో పాటు  ఇరుగుపొరుగు  ఊరి జనాలు కూడా మా ఆలోచనకి సహకరిస్తున్నారు. దొంగదారిన ఊరిలోకొచ్చే అవకాశమే లేదు. ఏ మార్గంలో వచ్చినా గ్రామస్తులు కాపుకాచి ఐడీ కార్డు అడుగుతారు. ఎవరి మీదనైనా డౌట్​ వస్తే.. వెంటనే అందరికీ సమాచారం ఇస్తారు. దీనివల్ల పదేళ్లుగా ఎటువంటి మోసాలు లేవు.
- శేఖర్​రెడ్డి

అందుకే ఈ సిస్టమ్
మా ఊరిలో  ఎలాంటి మోసాలు, దొంగతనాలు జరగకూడదనే   ఈ సిస్టమ్​ పెట్టాం. మా ఊరికి కొత్త వాళ్లు ఎవరు వచ్చినా  ఈ సిస్టమ్​ పాటించాల్సిందే.  వస్తువులు అమ్మటానికి వచ్చే వాళ్లయితే కార్డు చూపించటంతో పాటు, పంచాయితీలో  పేర్లు రాయించుకోవాలి.  ఈ మంచి పనికోసం మా ఊరంతా ఏక తాటిపై  నడుస్తున్నాం. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు ఊళ్లో ఏ సమస్య వచ్చినా ఒకరికొకరం అండగా ఉంటాం.
- నర్సింగ్​రావు