జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ అవసరం : వివేక్ వెంకటస్వామి

జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ అవసరం : వివేక్ వెంకటస్వామి

కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్ వివేక్ వెంకటస్వామి

ఎంబీఏ కాలేజీలో స్టూడెంట్లకు ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ 

ముషీరాబాద్,వెలుగు : పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే ప్లానింగ్ ఉండాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్ జి. వివేక్ వెంకటస్వామి స్టూడెంట్లకు సూచించారు. జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ అవసరమని.. ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ టెక్నాలజీలో ఎంబీఏ స్టూడెంట్లకు ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది.  వివేక్ వెంకటస్వామితో పాటు ఉస్మానియా వర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్​మెంట్ కాలేజీ ప్రిన్సిపల్, సీనియర్ ప్రొఫెసర్ డి. శ్రీరాములు, విశాక ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి. వంశీ చీఫ్ గెస్టులుగా హాజరై స్టూడెంట్లకు దిశా నిర్దేశం చేశారు.

వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. స్టూడెంట్లు చదువుకుంటూనే ప్రజెంటేషన్ స్కిల్​ను కూడా డెవలప్ చేసుకోవాలన్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో అంబేద్కర్ విద్యాసంస్థలు ఎప్పుడూ ముందుంటాయని.. స్టూడెంట్ల భవిష్యత్ కోసం కృషి చేస్తాయని ఆయన చెప్పారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే లైఫ్​ స్కిల్క్, క్రియేటివిటీ అవసరమని ప్రొఫెసర్ శ్రీరాములు తెలిపారు. కార్పొరేట్ ప్రపంచంలో ఎదగాలంటే నేర్చుకోవాలనే తపన, నాయకత్వ లక్షణాలు మార్కెట్​పై అవగాహన ఉండాలని విశాక ఇండస్ట్రీస్ జాయింట్ ఎండీ వంశీ అన్నారు. మార్కెట్​లో వస్తున్న మార్పులను గమనిస్తూ కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కోరారు. అనంతరం అంబేద్కర్ ఎంబీఏ కాలేజీలో కొత్తగా నిర్మించిన ఆడిటోరియాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్టూడెంట్లు, టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ పాల్గొన్నారు.

లా కాలేజీలో మానవ హక్కుల దినోత్సవం

అంబేద్కర్ లా కాలేజీలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ‘అందరికీ గౌరవం, స్వేచ్ఛ, న్యాయం’ అంశంపై  సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీస్​తో కలిసి సెమినార్ ఏర్పాటు చేశారు. చీఫ్ గెస్టుగా హాజరైన జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సాయికిరణ్​ మాట్లాడుతూ..  మానవ హక్కులను పొందడం.. వాటి అమలు ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ దామోదర్ రెడ్డి, లా స్టూడెంట్లు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.