రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్.. 1891లో తక్కువ కులంగా ముద్రపడిన మహర్ కులంలో పుట్టారు. తండ్రి రామ్జీ మాలోజీ సక్పాల్, తల్లి భీమాబాయి. హైస్కూలు వరకు ముంబైలోని ఎల్ ఫిన్ స్టోన్ హైస్కూల్ చదువుకున్నారు. అంబేద్కర్ కు చిన్నవయసులోనే రమాబాయితో పెళ్ళి జరిగింది. అయినా చదువు ఆపలేదు. 1907లో మెట్రిక్యులేషన్ పూర్తయింది. 1912లో ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో బొంబాయి యూనివర్సిటీ నుంచి డిగ్రీ సాధించారు. బరోడా రాజు సంస్థానంలో..ఏడాది పాటు గుమాస్తాగా పనిచేశారు. అప్పుడే అంబేద్కర్ సత్తా ఏమిటో జనానికి తెలిసింది. అంబేద్కర్ మామూలు స్టూడెంట్ కాదని బరోడా ప్రభువూ గ్రహించారు. పై చదువులకోసం అంబేద్కర్ ను అమెరికా పంపించారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి  పీజీ, పీహెచ్ డీ సాధించారు. 1927లో ఎకానామిక్స్ లో పట్టా పొందారు. ఆ తర్వాత లండన్ వెళ్ళారు అంబేద్కర్.

లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్ లో చేరిన అంబేద్కర్…మద్యలోనే  1917లో ఇండియా కు తిరిగివచ్చేశారు. ఇండియా వచ్చినా కూడా చదువుపైనే ధ్యాస. ఆ తర్వాత కొల్లాపూర్ సంస్థాన్ సాహూ మహరాజ్  సహకారంతో…తిరిగి లండన్ వెళ్లారు. 1921, 1923లో రెండు డాక్టరేట్ లు సాధించారు. ఒక్క వ్యక్తి నాలుగు పీహెచ్ డీ డాక్టరేట్లు సాధించిన ఘనత కేవలం అంబేద్కర్ దే.

1926లో లాయర్ గా ప్రాక్టీస్ చేశారు అంబేద్కర్. అక్కడే అంటరానితనంపై తొలిసారిగా పిడికిలి బిగించారు. బహిష్కృత హితకారిణి సభ అనే సంస్థ ఏర్పాటు చేసి దళితులకోసం పాటుపడ్డారు. అట్టడుగువర్గాలకు చదువే ఆయుధమని చెప్పేవారు అంబేద్కర్. అంటరాని కులస్తులుగా ముద్రపడ్డవాళ్ళని గుళ్ళోకి తీసుకెళ్ళారు. వాళ్ళమీద ఉన్న బ్యాన్ ను ఎదిరించి…. చెరువులో మంచినీళ్ళు తాగేలా చేశారు. ఇలా కులం జులుంమీద తిరగబడ్డారు.

1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి ముంబాయి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీచేశారు అంబేద్కర్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి దళితుల వాయిస్ గా మారారు. తక్కువ కులస్తులుగా ముద్రపడినవాళ్ళకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని పట్టుబట్టారు. కాని గాంధీజీ ఒప్పుకోకపోవడంతో ఆ కల సాకారం కాలేదు. కులాన్ని పెంచి పోషిస్తున్న హిందూమతాన్ని వదిలేస్తున్నానని ప్రకటించి బౌద్ధమతాన్ని స్వీకరించారు.

దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు అంబేద్కర్. దేశానికి దశ దిశ చూపెట్టేందుకు రాజ్యాంగ రచన బాధ్యతలు చేపట్టారు. చదువులో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని పట్టుపట్టి సాధించింది అంబేద్కరే. కొత్తగా ఏర్పడ్డ దేశానికి రాజ్యాంగం రాసే అద్భుత అవకాశం అంబేద్కర్ కు రావడంతో బడుగులకు వరంగా మారింది. రాజ్యాంగం ఇంత సమగ్రంగా ఉందంటే అంబేద్కర్ తెలివితేటలే కారణం.

1956, డిసెంబర్ 6న అంబేద్కర్ తుదిశ్వాస విడిచారు. అంబేద్కర్ ను గుర్తు చేసుకోవడమే కాదు, ఆయన చెప్పింది ఆచరించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో అంబేద్కర్ చెప్పిన ఒక సూక్తి గుర్తుచేసుకోవాల్సి ఉంది. నేను తీసుకెళ్తున్న చైతన్యరథాన్ని వీలైతే ముందుకు తీసుకెళ్ళండి. అలా చేయలేనప్పుడు దాన్ని అక్కడే వదిలేయండి. అంతేకానీ, వెనక్కి తీసుకుపోవద్దన్నారాయన.