ఇవాళ తిరుమల ఆలయం మూసివేత

ఇవాళ తిరుమల ఆలయం మూసివేత

తిరుమల, వెలుగు: చంద్రగ్రహణం కారణంగా  మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 1.31 నుండి బుధవారం తెల్లవారుజామున 4.29 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది.  గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. బుధవారం ఉద యం 5 గంటలకు సుప్రభాతంతో తలుపులు తెరి చి ఆలయాన్ని శుద్ధి  చేస్తారు. 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. బుధవారం ఆణివార ఆస్థానం సంద‌ర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల వరకే దర్శనానికి అనుమతిస్తారు. సమయాభావం కారణంగా భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతించరు.  బుధ‌వారం ఉద‌యం 5 గంట‌ల నుంచే అనుమ‌తిస్తారు. మంగళవారం దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. మంగ‌ళ‌వారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ నిలిపేస్తున్నట్లు తెలిపింది. మంగ‌ళ‌వారం అష్టద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న‌, వ‌సంతోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవ‌లు ర‌ద్దయ్యాయి. బుధవారం కల్యాణోత్సవం సహస్రదీపాలంకార సేవలను టీటీడి రద్దు చేసింది.