ఢిల్లీ స్పీడ్‌కు రాజస్తాన్‌ నిలిచేనా?

ఢిల్లీ స్పీడ్‌కు రాజస్తాన్‌ నిలిచేనా?

షార్జా:  హ్యాట్రిక్‌‌ ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న రాజస్తాన్‌‌  రాయల్స్‌‌ తమ నెక్స్ట్‌‌ మ్యాచ్‌‌లో  బలమైన ప్రత్యర్థిని  ఢీకొనేందుకు రెడీ అవుతోంది. శుక్రవారం ఇక్కడ జరిగే లీగ్‌‌ మ్యాచ్‌‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో తలపడనుంది.  ఈ సీజన్‌‌లో ఇప్పటిదాకా ఐదు మ్యాచ్‌‌లాడిన రాజస్తాన్‌‌ రెండింటిలోనే గెలిచింది. ఈ రెండూ షార్జాలోనే కావడం గమనార్హం. దుబాయ్‌‌, అబుదాబిల్లో జరిగిన మ్యాచ్‌‌ల్లో రాయల్స్‌‌ ప్లేయర్లు అట్టర్ ఫ్లాపయ్యారు. దీంతో కలిసొచ్చిన గ్రౌండ్‌‌లో తిరిగి గాడిలో పడాలని ఆ టీమ్‌‌ భావిస్తోంది.  కానీ  అది అనుకున్నంత ఈజీ కాదు. శ్రేయస్‌‌ అయ్యర్‌‌ కెప్టెన్సీలోని ఢిల్లీ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. రాజస్తాన్‌‌ మాత్రం ఇప్పటికీ తుది జట్టు ఎంపికలో ఇబ్బందులు పడుతూనే ఉంది.  కెప్టెన్‌‌ స్టీవ్‌‌ స్మిత్‌‌, సంజూ శాంసన్‌‌ సడెన్‌‌గా ఫామ్‌‌ కోల్పోవడం ఆ జట్టును మరింత దెబ్బతీసింది. ముంబైతో మ్యాచ్‌‌లో యశస్వి జైస్వాల్‌‌, పేసర్‌‌ కార్తీక్‌‌ త్యాగి, అంకిత్‌‌ రాజ్‌‌పుత్‌‌ను టీమ్‌‌లోకి తీసుకున్నా రాత మారలేదు. జోస్‌‌ బట్లర్‌‌ ఫామ్‌‌లోకి రావడం ఒక్కటే వారికి సానుకూలాంశం. బౌలింగ్‌‌లో ఆర్చర్‌‌, టామ్‌‌ కరన్‌‌ ఫర్వాలేదనిపిస్తున్నా, స్పిన్నర్‌‌ తెవాటియా  నిలకడ చూపలేకపోతున్నాడు. మరో పక్క ఢిల్లీ జట్టు అన్ని ఏరియాల్లో బ్యాలెన్స్‌‌డ్‌‌గా ఉంది. కెప్టెన్‌‌ అయ్యర్‌‌ సూపర్‌‌ ఫామ్‌‌లో ఉండగా,  ఓపెనర్‌‌ పృథ్వీ షా, రిషబ్‌‌ పంత్‌‌ రాణిస్తున్నారు. ఆల్‌‌రౌండర్‌‌ మార్కస్‌‌ స్టోయినిస్‌‌  కూడా మంచి టచ్‌‌లో ఉన్నాడు. బౌలింగ్‌‌లోనూ ఢిల్లీకి ఎలాంటి ఇబ్బందుల్లేవు. రబాడ  లీగ్‌‌లో టాప్‌‌ బౌలర్‌‌ కాగా, నోర్జ్‌‌ అతనికి మంచి సపోర్ట్​ ఇస్తున్నాడు.  ఇషాంత్‌‌కు రీప్లేస్‌‌మెంట్‌‌గా వచ్చిన హర్షల్‌‌ పటేల్‌‌ కూడా సత్తా చూపెడుతుండగా, అశ్విన్‌‌ చేరికతో లైనప్‌‌ మరింత బలంగా మారింది. మరి  ఢిల్లీ సవాల్‌‌ను రాజస్తాన్‌‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.