ప్రజా సంగ్రామ యాత్రకు ఇవాళ బ్రేక్‌‌

ప్రజా సంగ్రామ యాత్రకు ఇవాళ బ్రేక్‌‌
  • సీఎం కేసీఆర్‌‌ను ప్రశ్నించిన బండి సంజయ్‌
  • కార్పొరేషన్ కింద తెచ్చిన వేల కోట్లు ఏం జేసినవ్​?
  • మునుగోడులోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా
  • బీబీ నగర్‌‌లో నాలుగో రోజు ప్రజాసంగ్రామ యాత్ర

యాదాద్రి, వెలుగు:  తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ అమీర్ అయితే.. ప్రజలు బికారీలు అయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘‘ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే.. ఆయన తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు, చేసిన అప్పుల కారణంగా ప్రజలు బికారీలు అయ్యారు”అని ధ్వజమెత్తారు. యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం బీబీ నగర్ మండలం పెద్దరావులపల్లిలో మూసీ మురికి నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. 


బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు ‘మూసీ కాలుష్యం’పై రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళన కోసం 2002లోనే అప్పటి కేంద్ర మంత్రి ఎల్‌‌కే అద్వానీ రూ.344 కోట్లు కేటాయించినా.. గత టీడీపీ, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్, టీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ డబ్బు ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. కార్పొరేషన్ పేర్లతో తెచ్చిన రూ.వేల కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. మూసీని ప్రక్షాళన చేస్తానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి, ఆ తర్వాత మూసీ రీవర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వదిలేశారని మండిపడ్డారు. 

కేసీఆర్​కు మూసీ నీళ్లతో స్నానం చేయించాలే 

‘‘మూసీ నదిని రూ.4 వేల కోట్లతో ప్రక్షాళన చేసి, గోదావరి నదిలా మార్చి అందులో స్నానం చేస్తానని కేసీఆర్‌‌‌‌ చెప్పిండు. బోట్లు వేసుకొని తిరిగేట్టు మారుస్తానన్నడు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా చేస్తానన్నడు. ఇందులో ఏ ఒక్కటి జరగలేదు. ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్‌‌‌‌ను​మూసీ ఒడ్డున చెట్టుకు కట్టేసి, మూసీ నీళ్లు మీదపోసి ఐరన్ బ్రష్‌‌తో రుద్ది స్నానం చేయించి, ఫినాయిల్ పోసి కడగాలి. అప్పుడైనా బుద్ధి వచ్చి మూసీ ప్రక్షాళన చేస్తాడేమో”అని ఫైర్‌‌‌‌ అయ్యారు. 

ఉప ఎన్నికలంటే కేసీఆర్‌‌‌‌కు టైం పాస్ 

ఉప ఎన్నికలు రావాలని కోరుకునే కేసీఆర్.. వాటిని టైం పాస్‌‌గా భావిస్తారని సంజయ్ అన్నారు. తెలంగాణ ఉద్యమ టైమ్​లో కూడా ఉప ఎన్నికలు సృష్టించింది కేసీఆరే​ అన్న సంగతి మర్చిపోవద్దన్నారు. దుబ్బాక, హూజూరాబాద్‌‌లలో గెలిచినట్టే త్వరలో జరగబోయే మునుగోడులో బీజేపీ అభ్యర్థే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం డెవలప్​మెంట్‌‌ కోసం మోడీని ఎంపీ వెంకట్‌‌రెడ్డి ​కలుస్తూ ఉంటారని చెప్పారు. రాజగోపాల్ ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. 

దాసోజును బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం.. 

కాంగ్రెస్‌‌కు​ రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌‌ను ​ఘర్ వాపసీలో భాగంగా బీజేపీలోకి రావాలని సంజయ్ ఆహ్వానించారు. దాసోజు రాజీనామాపై మీడియా ప్రశ్నించగా, ఆయన స్పందించారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, తనతో సహా ఎంతో మందికి ఉద్యమంపై సలహాలు, సూచనలు ఇచ్చారని వెల్లడించారు. సంజయ్ వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు, లీడర్లు గూడూరు నారాయణరెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఉన్నారు. 

ప్రజా సంగ్రామ యాత్రకు నేడు బ్రేక్‌‌

ప్రజా సంగ్రామ యాత్రకు శనివారం విరామం ఇవ్వనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నందున ఎంపీ సంజయ్ ఓటు వేయడానికి ఢిల్లీకి వెళ్తున్నారు.

కేసీఆర్‌‌‌‌కు కొరియర్‌‌‌‌లో మూసీ మురికి నీళ్లు

సీఎం కేసీఆర్‌‌‌‌కు మూసీ మురికి నీళ్ల బాటిళ్లను కొరియర్‌‌‌‌లో సంజయ్ పంపించారు. బాటిళ్లతో పాటు బహిరంగా లేఖ కూడా రాశారు. మూసీ కారణంగా ఈ ప్రాంత ప్రజలు బతకలేని దుస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. వాళ్లెంత దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారో తెలిపేందుకే ‘‘మూసీ నీళ్లను మీకు కొరియర్ చేస్తున్నా. వాటిని తాగుతావో.. స్నానం చేస్తావో.. ఇంకేం చేసుకుంటావో మీ ఇష్టం”అని అన్నారు.