
ఐసీసీ ఈవెంట్లలో ఇండియా‑పాకిస్తాన్ మ్యాచ్ జరగాలంటే కనీసం ఏడాది ఎదురు చూడాలి. కానీ, ఆసియా కప్ పుణ్యమా అని దాయాది జట్లు వారం రోజుల్లోనే రెండోసారి పోటీకి రెడీ అయ్యాయి. మెగా ఈవెంట్ గ్రూప్‑ఎలో పాక్‌పై ఉత్కంఠ విజయంతో బోణీ కొట్టిన టీమిండియా నేడు సూపర్‑4 రౌండ్ తొలి పోరులో ఆ జట్టును మళ్లీ ఢీకొట్టనుంది. గత ఫలితాన్ని పునరావృతం చేయాలని రోహిత్‌సేన భావిస్తుంటే.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ కసిగా ఉన్నది. ఈ నేపథ్యంలో మరో ‘సూపర్ సండే’ క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వనుంది. మరి, ఇందులో సూపర్ అనిపించే జట్టేదో చూడాలి!
దుబాయ్: వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న టీమిండియా కఠిన పరీక్ష ఎదుర్కోబోతోంది. ఆదివారం జరిగే సూపర్4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. పాక్‌తో తొలి పోరులో కష్టంగా గట్టెక్కిన ఇండియా.. కసి మీదున్న ఆ జట్టును మరోసారి ఓడించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. గాయం వల్ల స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సేవలు కోల్పోయిన రోహిత్‌సేన టాపార్డర్ తడబాటు, అనుభవం లేని పేస్ బౌలింగ్ ఎటాక్‌తో కాస్త ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో ఇండియా చేతిలో ఓటమి నుంచి తేరుకొని హాంకాంగ్‌పై 155 రన్స్ తేడాతో రికార్డు విక్టరీ సాధించిన పాక్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. కాబట్టి రోహిత్‌సేన ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లీ పవర్‌ప్లేలో నిదానంగా ఆడటంతో జట్టుకు మంచి ఆరంభం దక్కడం లేదు. పాక్‌పై కేఎల్ రాహుల్ డకౌట్ అవ్వగా.. రోహిత్, కోహ్లీ కూడా ఇబ్బంది పడ్డారు. పాక్ పేసర్ల బౌలింగ్‌లో స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోయారు. దాంతో, చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో జట్టు చివరి ఓవర్ వరకూ వేచి చూడాల్సి వచ్చింది. జడేజాతో హార్దిక్ పాండ్యా వీరోచిత పోరాటంతో జట్టు గెలిచింది. ఇప్పుడు జడేజా టీమ్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌తో పాటు కేఎల్ ఫస్ట్ ఓవర్ నుంచే బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది.
కోహ్లీ ఫాంలోకి రావడం ప్లస్ పాయింట్..
హాంకాంగ్‌పై ఫిఫ్టీతో కోహ్లీ తిగిరి ఫామ్‌లోకి రావడం ప్లస్ పాయింట్. కానీ, ఇన్నింగ్స్ ఆరంభంలో తను వేగం పెంచాల్సి ఉంది. గత పోరులో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్‌పై ఈ సారి కూడా భారీ అంచనాలున్నాయి. పాక్‌పై తొలి మ్యాచ్‌లో క్రీజులో కుదురుకున్న తర్వాత ఔటైన అతను ఈ సారి దంచికొట్టాలని చూస్తున్నాడు. ఇక, తొలి మ్యాచ్‌లో నాలుగో నంబర్‌లో జడేజాను పంపించి కోచ్ రాహుల్ ప్రయోగం చేశాడు. పాక్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు లెఫ్ట్– రైట్ కాంబినేషన్ వర్కౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్, ద్రవిడ్ ఏదైనా సర్‌ప్రైజ్ ప్లాన్‌తో వస్తారేమో చూడాలి. జడేజా గైర్హాజరీలో ఇప్పుడు టాప్6లో ఏకైక లెఫ్టాండర్ రిషబ్ పంత్ ఒక్కడే ఉన్నాడు. ఈనేపథ్యంలో తను తుది జట్టులోకి రావడం గ్యారంటీ అనొచ్చు. అప్పుడు దినేశ్ కార్తీక్‌కు ప్లేస్ ఉంటుందో లేదో చూడాలి. జడేజా ప్లేస్‌ను ఎవరితో భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. జడ్డూ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్‌కు బ్యాటింగ్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా, బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్ నుంచి పోటీ ఉంది. పాక్ టాప్6 బ్యాటర్లలో ఇద్దరు లెఫ్టాండర్లు (ఫకర్ జమాన్, కుష్దిల్ షా) ఉన్న నేపథ్యంలో ఆఫ్ స్పిన్నర్ బెస్ట్ ఆప్షన్ అనొచ్చు. బౌలింగ్‌లో పేస్ లీడర్ భువనేశ్వర్‌తో పాటు హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కానీ, యువ బౌలర్లు అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ నిరాశ పరుస్తున్నారు. అవేశ్ ఖాన్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడని కోచ్ ద్రవిడ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో అతడిని తప్పించి ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను ఆడించే చాన్స్ కనిపిస్తోంది.
జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్/కార్తీక్ (కీపర్), పాండ్యా, అక్షర్, భువనేశ్వర్, అశ్విన్/అవేశ్, అర్ష్‌దీప్, చహల్.
పాకిస్తాన్: బాబర్(కెప్టెన్), రిజ్వాన్ (కీపర్), జమాన్, ఇఫ్తికర్, కుష్దిల్, షాదాబ్, ఆసిఫ్, నవాజ్, నసీమ్, రవూఫ్, హసన్ అలీ/హస్నైన్.
ఈ సారి అంత ఈజీ కాదు
ఇండియా చేతిలో ఓటమి తర్వాత పాక్ బలంగా పుంజుకుంది. గత పోరులో హాంకాంగ్‌పై భారీ స్కోరు చేసిన పాక్ బౌలింగ్‌లో చెలరేగి ఆ జట్టును 38 రన్స్‌కే ఆలౌట్ చేసింది. ఓపెనర్ రిజ్వాన్ ఫామ్ కొనసాగించగా.. ఫఖర్ జమాన్, కుష్దిల్ షా కూడా టచ్‌లోకి రావడంతో టీమ్ బ్యాటింగ్ బలం పెరిగింది. ఈ పోరులో తొలి పది ఓవర్లలో ఎక్కువ రన్స్ చేయడంపై ఫోకస్ పెట్టింది. ఇక, బౌలింగ్‌లో ఆ జట్టుకు తిరుగులేదు. స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది ప్లేస్‌లో వచ్చిన 19 ఏళ్ల నసీమ్ షా కొత్త హీరోగా మారాడు. పదునైన బాల్స్ వేస్తున్న అతని నుంచి ఇండియా బ్యాటర్లకు ముప్పు తప్పకపోవచ్చు. మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ లెఫ్ట్–రైట్ స్పిన్ తో కూడా సవాల్ ఎదురవనుంది.