
ఆయన ఏ స్థాయిలో ఉన్నా నిరంతరం ప్రజాపక్షమే. ఏ నిర్ణయం తీసుకున్నా అది కోట్లాది మందికి మేలు చేసేదే. తన జీవితాంతం పేదలు, కార్మికుల సంక్షేమానికి బాటలు వేశారు గడ్డం వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమ నాయకునిగా, కేంద్ర మంత్రిగా పేదల సంక్షేమం కోసం కృషి చేసిన నేత కాకా. ఇవాళ ఆయన 90వ జయంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ.
జి. వెంకటస్వామి. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఆయనది కీలక పాత్ర. కేంద్రమంత్రిగా…. కార్మికుల పక్షపాతిగా ఎన్నో సేవలు చేశారు. అభిమానులు, అనుచరులు ఆయన్ను కాకాగా పిలుచుకుంటారు. పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గడ్డం వెంకటస్వామి 1929 అక్టోబర్ 5 న హైదరాబాద్ లో జన్మించారు. తల్లి పెంటమ్మ, తండ్రి మల్లయ్య. బతికినంత కాలం పేదల సంక్షేమం, అభివృద్ధి కోసమే పాటు పడ్డారు కాకా.
వెంకటస్వామి తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. నాటి ఉద్యమంలో బుల్లెట్ దెబ్బలు తిన్నారు. ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు వెంకటస్వామి. మలి దశ ఉద్యమంలో సొంత పార్టీనే ధిక్కరించారు. యూపీఏ సీఎంపీలో తెలంగాణ అంశాన్ని పెట్టించారు. ఆ తర్వాత… పార్లమెంట్ లో బిల్లు పెట్టి.. పాస్ చేయించే వరకు… కాకా ఉద్యమం ఆగలేదు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలా అలుపెరగకుండా పోరాటం చేశారు వెంకటస్వామి.
కేంద్ర, రాష్ట్రమంత్రిగా ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణలు, పెట్టిన స్కీంలు దేశానికే ఆదర్శమయ్యాయి. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసిందీ కాకానే. కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించింది కూడా ఆయనే. సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన చొరవ కారణంగానే కార్మికులకు వేతనాలు, పెన్షన్, జీవన భద్రత కలిగింది.
ఖాయిలా పడిన పరిశ్రమలను దేశ చరిత్రలో తొలిసారిగా తెరిపించిన అరుదైన ఘనత కూడా కాకాకే దక్కుతుంది. రామంగుండం ఫర్టిలైజర్ కంపెనీని కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరీ రీఓపెన్ చేయించారు కాకా. ఆయన పోరాటం ఫలితంగా 3 వేల మంది కార్మికులకు ఉపాధి దొరికింది…. అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల సమస్యలను ప్రస్తావించారు కాకా. దళిత నేపథ్యం నుంచి వచ్చినా… అందరి నాయకుడిగా మన్నలను అందుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వేలాది మంది పేదలకు నివాసాలు ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఆయన పెద్ద ఉద్యమమే చేశారు. అప్పటి నుంచే ఆయనను గుడిసెల వెంకటస్వామిగా పిలుచుకుంటారు. ఎన్ని పదవులు చేపట్టినా పేదల కోసమే పాటుపడ్డారు వెంకటస్వామి. అందుకే పేదల నాయకునిగా చరిత్రలో నిలిచిపోయారు కాకా.
కేంద్ర మాజీమంత్రి, దళిత నేత కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను సర్కార్ అధికారికంగా నిర్వహించనుంది. 1929 అక్టోబర్ 5న జన్మించిన వెంకటస్వామి 90వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. ట్యాంక్ బండ్ సాగర్ పార్క్ లోని వెంకటస్వామి విగ్రహం దగ్గర.. అధికారికంగా జయంతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు జరిగే జయంతి వేడుకలకు పలు పార్టీల నేతలు, దళిత సంఘాల నేతలు, కార్మికులు, కాకా అభిమానులు హాజరుకానున్నారు.