ఎక్కడ  ప్రేమ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు

V6 Velugu Posted on Aug 30, 2021

సృష్టిని ప్రేమ బాటలో నడిపించాలి. ధర్మాన్ని గెలిపించాలి. దయా గుణాన్ని గుర్తుచేయాలి. ఈ సంకల్పంతోనే కొన్ని వేల సంవత్సరాల కిందట ఇదే రోజున భూమ్మీదకి వచ్చాడు కృష్ణుడు. అందుకే ఈ రోజుని ఓ పెద్ద పండుగలా జరుపుకుంటారు .  ఉదయాన్నే తలస్నానాలు చేసి కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం చిన్ని కృష్ణుడ్ని  ఊరేగిస్తారు. ఆ తర్వాత ఊయలలో చిన్ని కృష్ణుడ్ని ఉంచి, ఊపితే కోరిన కోరికలు  తీరతాయట.  కృష్ణుడికి ఇష్టమైన  పాలు, వెన్న, పండ్లు, అటుకుల్ని నైవేద్యంగా పెడితే కృష్ణుడు సంతోషిస్తాడు. ఈరోజు కృష్ణుడ్ని పూజించి భాగవతం చదివినా, దానం చేసినా సకలపాపాలు పోతాయని నమ్ముతారు.


ప్రేమని, కృష్ణుడ్ని వేరు చేసి చూడలేం.  ఎక్కడ  ప్రేమ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు కొలువై ఉంటాడో  అక్కడ ప్రేమ  ఉంటుంది. అందుకే సృష్టిలో ప్రేమ అనే పదం వినిపించిన ప్రతిసారీ కృష్ణుడే గుర్తుకొస్తాడు. ఆయన  ప్రేమ లీలలు పెదాల మీద నవ్వై పూస్తాయి. శరీరంలోని అణువణువుకి ప్రేమ అర్థాన్ని చెబుతాయి. కృష్ణుడి ప్రేమ ప్రకృతిని కూడా కదిలిస్తుంది. అది  ఆ బాలగోపాలుడి ప్రేమకున్న గొప్పదనం. మనుషులకి  ప్రేమని, ప్రేమ గొప్పదనాన్ని చెప్పిన శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన చిన్ని కృష్ణుడు పుట్టింది ఈరోజే.  

పదహారు వేలమంది గోపికలు.. ఎనిమిదిమంది భార్యలు. ప్రాణంగా ప్రేమించే రాధ. కానీ, వాళ్లలో ఎవరూ కృష్ణుడు తమని నిర్లక్ష్యం చేశాడని చెప్పింది లేదు. అందరికీ కృష్ణుడి పట్ల అదే స్వచ్ఛమైన ప్రేమ.. కృష్ణుడికి కూడా వాళ్లంటే అంతే గౌరవం. కారణం కృష్ణుడు వాళ్ల ఆత్మతో ముడిపడి ఉన్నాడు. కృష్ణుడు వాళ్ల ఆత్మని ప్రేమించాడు. వాళ్ల ఆత్మతో సావాసం చేశాడు. అందుకే కృష్ణుడి ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోయింది. 
ప్రేమంటే.. 
కృష్ణుడి దృష్టిలో ప్రేమంటే  మోహం కాదు.. రెండు మనసుల మధ్య ఉన్న స్నేహం. అందులో ఒకరిపట్ల మరొకరికి గౌరవం ఉంటుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటుంది.  అన్నింటికన్నా ముఖ్యంగా  ఆ బంధంలో  సమానత్వం ఉంటుంది. అందరికీ సమానమైన ప్రేమని పంచుతాడు కాబట్టే గోపికలు, అష్ట భార్యలకి  మధ్య  ఏ రోజూ పొరపొచ్చాలు రాలేదు. అలాగే కృష్ణుడి దృష్టిలో  ప్రేమంటే వస్తువు కాదు. బలవంతంగా సొంతం చేసుకోవడానికి ప్రేమ రాజ్యం కాదు. ప్రేమంటే ఒక శక్తి . ఆ శక్తి మీకోసం ఎలాంటి బంధాలని అయినా తెంచుకోగలుగుతుంది. కానీ, స్వయంగా తన స్వేచ్ఛని చిక్కుల్లో పెట్టుకోదు అంటాడు కృష్ణుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్లని స్వేచ్ఛగా వదిలేయాలి. స్వేచ్ఛ లేకపోతే ఏ బంధం నిలబడదు. నిస్వార్థంతో ప్రేమిస్తేనే బంధం బలపడుతుంది. కృష్ణుడి ఆలోచనల్లో ప్రేమంటే కేవలం ఆలుమగల మధ్య ఉండే ఆకర్షణ బంధం  కాదు. ప్రేమ కుటుంబంపై కలగొచ్చు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు, పుట్టిపెరిగిన ఊరు, ఆటలాడిన ఇల్లు లేదా ఆర్ట్​ ..ఇలా దేనిమీదైనా కలగొచ్చు. ఈ ప్రకృతిపైనా కలగొచ్చు. కానీ, ఆ ప్రేమ ఎప్పుడూ  స్వార్థంతో నిండిపోయిన మనసులో నిలవలేదు అంటాడు కృష్ణుడు. ఆ ప్రేమని పొందాలంటే మొదట మనసుని పూర్తిగా ఖాళీ చేయాలి. మన ఇష్టాల్ని, సుఖాల్ని త్యాగం చేయాలి. మన మనసు నుంచి స్వార్థాన్ని తీసేయాలి. అప్పుడే మనకు ప్రేమ దక్కుతుంది అంటాడు.
గమ్యం పెళ్లి కాదు..  
పెళ్లి అనేది   ప్రేమకి గమ్యం కాదనేది కృష్ణుడి మాట. అసలు ఆత్మల మధ్య ఉన్న బంధానికి పేరుతో పనేంటి అంటాడు కృష్ణుడు. 
రాధాకృష్ణుల మధ్య ఉన్న  బంధం కూడా అలాంటిదే. కృష్ణుడి మనసు రాధకి అంకితం.. రాధ నిస్వార్థమైన ప్రేమకి కృష్ణుడు  ఎప్పుడూ దాసోహమే. అందుకే ప్రేమ గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా రాధ వెంటే  కృష్ణుడు ఉంటాడు. నిజానికి వాళ్ల మధ్య ఉన్న బంధం శారీరక, భౌతిక అవసరాలకి అతీతమైంది. అందుకే రాధాకృష్ణులు ప్రేమకి ఓ నిర్వచనమయ్యారు.                           ::: మానసి

 

Tagged Special, krishnashtami, Lord Krishna,

Latest Videos

Subscribe Now

More News