ఇవాళ (May 01) మే డే.. అంబేద్కర్ లేకుంటే కార్మిక చట్టాలు లేవు..

ఇవాళ (May 01) మే డే.. అంబేద్కర్ లేకుంటే కార్మిక చట్టాలు లేవు..

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కార్మికులందరూ ఒకప్పుడు వెట్టి చాకిరికి గురయ్యారు.  చేసిన పనికి తగిన వేతనం ఇచ్చేవారు కాదు.  24 గంటలు  పారిశ్రామిక, పెట్టుబడి, యజమాన్య సంస్థలు వారి శ్రమను దోచుకునేవారు.  కార్మికులకు కార్మిక సంక్షేమ చట్టాలు లేవు. అడిగే అధికారం లేదు.  శ్రమ దోపిడీకి గురైన  కార్మికలోకం తమ హక్కుల కోసం 1884 అక్టోబర్ 7న  అమెరికాలోని  చికాగో నగరంలో సదస్సు  నిర్వహించింది. 

ఈ కార్మిక సదస్సుకు  అసంఘటిత,  వాణిజ్య,  వ్యాపార, పెట్టుబడి సంస్థలలో  పనిచేసే కార్మిక సంఘాలు సదస్సులో పాల్గొన్నాయి.  ఎనిమిది గంటల పనిదినాల కోసం,  కార్మిక హక్కుల కోసం ఉద్యమించాలని  కార్మిక సదస్సులో తీర్మానం చేయడం జరిగింది. 

ఈ పిలుపు అందుకొని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.  1886  మే 1న  అమెరికాలో సమ్మె సైరన్ మోగింది. 13 వేల పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి.  మూడు లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.  4 లక్షల మంది  కార్మికులు రోడ్లను దిగ్బంధం చేశారు. ఎర్రజెండాలతో  ప్రదర్శన నిర్వహించగా పారిశ్రామికవేత్తల గుండెల్లో గుబులు  పుట్టింది. భయాందోళనలకు గురయ్యారు.  అప్పుడు పెట్టుబడిదారుల కనుసైగలతో  పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు వీరమరణం పొందారు.  కాల్పులను వ్యతిరేకిస్తూ  1886  మే 4న  మార్కెట్  కార్మిక లోకంతో  నిండిపోయింది. 

 బ్రిటిష్  సామ్రాజ్యవాదుల తొత్తులు, పోలీసులు మమ్మల్ని కాల్చి చంపుతారా అంటూ  కార్మికులు తిరగబడ్డారు.  పోలీసులకు,  కార్మికులకు జరిగిన వీరోచిత పోరాటంలో  తూటాలు పేలాయి,  రక్తం తడిసి ముద్దయింది.  ఏడుగురు పోలీసులు,  8 మంది కార్మికులు  ప్రాణాలు కోల్పోయారు.  9 మందికి మరణశిక్ష పడింది.  ఎనిమిది మంది కార్మికులకు  15 సంవత్సరాలు  కఠిన కారాగార  శిక్ష విధించారు. ఆ వీరుల పోరాట ఫలితమే  మేడే. 

ఆ వీరులను స్మరించుకుందాం

మనదేశంలో  కార్మికుల హక్కుల రూపకర్త  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.  మన దేశంలో  ప్రభుత్వ రంగ,  ప్రైవేట్ రంగ సంస్థలు, అసంఘటిత కార్మికులు ఎంతోమంది కార్మిక హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి ప్రాణత్యాగం చేశారు.  నిర్బంధాలను ఎదుర్కొని  జైలుగదుల్లో మగ్గారు. కార్మికుల దుస్థితి చూసి కార్మిక హక్కుల ప్రదాత  అంబేద్కర్ చలించిపోయారు.  

కార్మికులకు బాసటగా  నిలిచారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ 17 స్థానాల్లో పోటీచేసి 15 స్థానాలలో గెలుపొందడం జరిగింది. అంబేద్కర్  వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్  కౌన్సిల్‌‌లో  కార్మికశాఖ మంత్రిగా1937లో  పనిచేశారు. ఆయన కార్మిక హక్కులు, పనిగంటలు తగ్గించడం కోసం చాలా కృషి చేశారు. 1942లో 14 గంటల పనిని 8 గంటలకు తగ్గించాలని ఆయన ప్రతిపాదించారు. 

 అంబేద్కర్ కృషితో  వచ్చిన 17 చట్టాలు 

కార్మికుల సంక్షేమానకి అంబేద్కర్​ విశేష కృషి చేశారు.  కార్మికుల పనిగంటలు ఎనిమిదికి తగ్గింపు.  లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం.  వేతన చెల్లింపు చట్టం.  కనీస వేతనాల చట్టం.  ఉద్యోగుల వేతన సవరణ చట్టం.  భారత కర్మాగారాల చట్టం.  భారత కార్మిక సంఘ చట్టం.  కార్మికుల పరిహార చట్టం.  కార్మికుల రక్షణ చట్టం.  ప్రసూతి ప్రయోజనాల చట్టం. 

 కార్మిక రాజ్య బీమా(ఈఎస్ఐ) చట్టం.  మహిళలు, బాల కార్మికుల రక్షణ చట్టం.  బొగ్గు గనుల కార్మికుల భవిష్య నిధి, బోనస్ చట్టం.  మహిళా కార్మికుల సంక్షేమ నిధి.  వేతనంతో కూడిన సెలవులు.  సామాజిక భద్రత.  ప్రభుత్వ, ప్రైవేట్, అసంఘటిత కార్మికులందరికీ ఎన్నో హక్కులు, భద్రతలను అంబేద్కర్​ కల్పించారు.   కాబట్టి,  మేడే  వేడుకల్లో అంబేద్కర్​ చిత్రపటాన్ని పెట్టి, కార్మికుల ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి గురించి కార్మిక లోకం, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కార్మిక సమాజం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

అంబేద్కర్​ లేకుంటే.. కార్మిక చట్టాలే లేవు

దేశంలో కార్మికులకు హక్కులు కల్పించింది అంబేద్కర్.  ఆయన లేకుంటే ఈ దేశంలో కార్మిక చట్టాలే లేవు.  ఆయన చేసిన కృషి, త్యాగాలను  మేడే సందర్భంగా ఈ దేశ కార్మికలోకం, కమ్యూనిస్టులు గుర్తు చేసుకోవాలి. పని గంటలను 12 నుంచి 8 గంటలకు తగ్గించాలని 1942 నవంబరు 27న ఢిల్లీలో తన అధ్యక్షతన నిర్వహించిన 4వ భారత కార్మిక సదస్సులో అంబేద్కర్  తొలిసారి ప్రతిపాదించారు.  

1945  నవంబరు 27, 28 తేదీల్లో జరిగిన 7వ సదస్సు.. కర్మాగారాల్లో వారానికి 48 గంటల పని విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 1923 నాటి కార్మికుల పరిహార చట్టం, ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1943 నాటి కర్మాగారాల చట్టాలలో కార్మికులకు అనుకూలంగా సవరణలు తీసుకొచ్చేందుకు వివిధ స్థాయిల్లో అంబేద్కర్ చర్యలు చేపట్టారు.  పరిశ్రమల్లో రోజుకు 12 గంటల పని విధానాన్ని ఆయన  వ్యతిరేకించారు. బ్రిటన్ తరహాలో వారానికి 48 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. 

డా. జేరిపోతుల పరశురామ్,
అంబేద్కర్ ​వాది