ఆ ఊరి బర్త్​డే ఇయ్యాల్నే

ఆ ఊరి బర్త్​డే ఇయ్యాల్నే

ఇప్పటి వరకు మనుషుల పుట్టినరోజులు చూసినం.  కొంతమంది పెట్స్ పుట్టినరోజులు కూడా జరపడం  చూసినం. ఊరికి పుట్టిన రోజు చేసుడు ఏడన్న చూసిన్రా? ఎక్కడో కాదు మన తెలంగాణల మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌‌‌‌ అనే ఊరికి ప్రతి సంవత్సరం సంక్రాంతినాడు పుట్టిన రోజు జరుపుతున్నరు. ఎందుకు జరుపుతున్నరో తెలిస్తే.. మీరు కూడా ‘హ్యాపీ బర్త్‌‌డే’ అని చెప్తరు.

మెదక్‌‌‌‌, పాపన్నపేట, వెలుగు: పన్నెండొందల మంది జనాభా ఉన్న లక్ష్మీనగర్ 1995లో ‌‌గ్రామ పంచాయతీ అయింది. ‘‘ఊరు మంచిగుంటేనే.. మనమందరం మంచిగుంటం. మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకోవాలె’’ అనే ఉద్దేశంతో పెండ్యాల ప్రసాద్ అనేటాయన 2014ల ‘లక్ష్మీనగర్‌‌ ‌‌వెల్ఫేర్‌‌ ‌‌సొసైటీ’ని ఏర్పాటు చేసిండు.  ‘ప్రతి సంవత్సరం సంక్రాంతినాడు ఊరికి పుట్టిన రోజు చేద్దాం’ అనే కాన్సెప్ట్‌‌తో ఊళ్లో వాళ్లందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఆరేళ్లుగా ఇది సక్సెస్‌‌ఫుల్‌‌గా నడుస్తున్నది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నవాళ్లు ఊరి అభివృద్ధికి తమ వంతు సాయం చేసేలా ఈ పుట్టిన రోజు నాడు అవగాహన కల్పిస్తున్నరు.

ఊరికోసం ప్రత్యేకంగా వెబ్‌‌సైట్‌‌!

పుట్టిన ఊరుకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మొక్కలు నాటి, వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేసిన్రు. ఎన్విరాన్‌‌మెంట్‌‌కి హానిచేసే ప్లాస్టిక్‌‌ వాడకుండా నిషేధించిన్రు. ఇలా ప్రతి పుట్టిన రోజుకు ఊరుకోసం ఓ కొత్త రెజల్యూషన్ తీసుకుంటరు. అంతేకాదు ఈ ఊరు పేరు మీద ఒక వెబ్‌‌సైట్ కూడా క్రియేట్ చేసిన్రు. దీంట్లో ఊరి చరిత్ర నుంచి మొదలుపెట్టి.. ఊళ్లో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని  అప్‌‌డేట్ చేస్తున్నరు. ఒకసారి www.ourlaxminagar.org లో చూస్తే.. ‘మన ఊరిని కూడా ఇట్ల మార్చుకోవాలె’ అనే ఆలోచన రావడం ఖాయం.

కేక్‌‌ కట్‌‌ చేసి..

కన్నతల్లిని.. పుట్టిన ఊరిని మర్చిపోవద్దంటారు. దాన్ని గుర్తు చేసేలా సంక్రాంతినాడు ఈ ఊరు పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా  భోగి మంటలు వేస్తారు. ముగ్గులు, పతంగుల పోటీలు పెడతారు. ఊళ్లో వాళ్లంతా ఒకదగ్గరికి చేరి.. సంతోషంగా చప్పట్లు కొడుతూ కేక్ కట్‌‌ చేస్తారు. ఆ తర్వాత గడిచిన సంవత్సరం చేసిన పనుల్ని రివ్యూ చేసుకుంటరు. ఈ ఏడాది  పూర్తి చేయాల్సిన పనులేంటో ప్లాన్‌‌ చేస్తరు. వాటిని ఎట్ల చేయాలో చర్చించుకుంటరు. మొత్తంమీద ‘మన ఊరిని.. మనమే కాపాడుకోవాలె’ అనే కాన్సెప్ట్‌‌తో మిగతా పల్లెలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తున్న లక్ష్మీనగర్‌‌‌‌కు హ్యాపీ బర్త్‌‌ డే!

ఇవీ చదవండి..

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

జాక్‌మా కంపెనీలను జాతీయం చేసే యోచనలో చైనా

సంక్రాంతి వేడుకంతా రైతుదే