
లోక్ సభ ఎన్నికల సమరంలో ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 54 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాల సాక్షిగా నరేంద్రమోడీ నేడు ప్రధానమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఎన్డీయేని గెలిపించిన మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి భవన్లోని ఫోర్స్ కోర్స్ ఏరియాలో రాత్రి 7 గంటలకు అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. దేశవిదేశాలకు చెందిన మొత్తం 6,500 మంది అతిథులు పాల్గొనున్నారు. 2014లో సార్క్ దేశాధినేతల్ని పిలిచిన మోడీ.. ఈసారి బిమ్స్టెక్అధినేతల్ని ఆహ్వానించారు. రాహుల్, సోనియాతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే పార్టీల నేతలు, ప్రతిపక్ష నాయకులు పాల్గొంటారు. మోడీతో పాటు కేబినెట్ మంత్రులతోనూ రాష్ట్రపతి కోవింద్ ప్రమాణం చేయిస్తారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, జగన్ ఒకే విమానంలో ఢిల్లీ వెళ్లి మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు.