నేడే ప్రమాణం..సీఎంగా ప్రమాణం చేయనున్న రేవంత్

నేడే ప్రమాణం..సీఎంగా ప్రమాణం చేయనున్న రేవంత్
  • ఎల్బీ స్టేడియం వేదిక..​ మధ్యాహ్నం 1.04 గంటలకు ముహూర్తం
  • హాజరుకానున్న సోనియా, ఖర్గే, రాహుల్​, ప్రియాంక
  • అమరవీరుల కుటుంబాలకు, ప్రజా సంఘాలకు ఇన్విటేషన్​
  • కేసీఆర్, జగన్​, స్టాలిన్​, సిద్ధరామయ్య, చంద్రబాబుకు కూడా
  • రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్వానిస్తూ  రేవంత్​ బహిరంగ లేఖ
  • ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేసే చాన్స్​

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, రాజకీయ ప్రముఖులు, సామాన్య జనం నడుమ రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్​రెడ్డి ప్రమాణం చేయనున్నారు. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా ఈ వేడుక జరగనుంది. మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా రేవంత్​ ప్రమాణం చేస్తారు. కొందరు మంత్రులుగా కూడా ప్రమాణం చేసే చాన్స్​ ఉంది. ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం ఉండనున్నట్లు తెలుస్తున్నది. ప్రమాణ స్వీకారోత్సవానికి అమరవీరుల కుటుంబాలతోపాటు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే,  రాహుల్​ గాంధీ, మాజీ సీఎం కేసీఆర్​ తదితరులను ఆహ్వానించారు. ‘‘రాష్ట్ర ప్రజలందరికీ ఇదే నా ఆహ్వానం’’ అంటూ రేవంత్​ బహిరంగ లేఖ రాశారు. 

30 వేల మందికి సరిపడేలా ఏర్పాట్లు

ప్రమాణ స్వీకారోత్సవానికి హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో 30 వేల మందికి సరిపడేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. 500 మంది వీవీఐపీలు, వీఐపీలకు ఏర్పాట్లు చేశారు. వేదికను ఏ, బీ, సీ బ్లాకులుగా తీర్చిదిద్దారు. ఏ బ్లాకులో గవర్నర్​తో పాటు ప్రమాణం చేసే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చోనున్నారు. బీ బ్లాక్​లో సోనియా, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఢిల్లీ నుంచి వచ్చే ఏఐసీసీ పెద్దలకు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంల కోసం ఏర్పాట్లు చేశారు. సీ బ్లాకులో అమరవీరుల కుటుంబాలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ రెడీ చేశారు. 

వేల మంది సాధారణ ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షిం చేందుకు స్టేడియం బయట భారీ ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేశారు. ఢిల్లీ నుంచి ఏఐసీసీ పెద్దలు, వీవీఐపీలు వస్తుండడంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలనూ విధించారు.  తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో  రేవంత్ కు స్వాగతం పలకనున్నారు. ఎల్బీ స్టేడియంలో 8వ గేటు నెంబర్​ నుంచి రేవంత్​ ఎంట్రీ ఉంటుందని ఆఫీసర్లు తెలిపారు.

వీరందరికీ ఆహ్వానాలు

ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్​ వంటి వారు హాజరుకానున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్​లు, ఏఐసీసీ మఖ్య నేతలకూ పీసీసీ నుంచి ఇన్విటేషన్లను పంపారు. బీఆర్ఎస్​ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డితో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల చీఫ్​లను, కొత్తగా ఎన్నికైన ఇతర పార్టీల ఎమ్మెల్యేలకూ ఆహ్వానాలను పంపించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌, తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్‌‌, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్‌‌ గెహ్లాట్, చత్తీస్​గఢ్ మాజీ సీఎం భూపేశ్‌‌ బఘేల్‌‌, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌‌ చౌహాన్​, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్‌‌సింగ్​, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్‌‌, చిదంబరం, మీరాకుమార్,  సుశీల్ కుమార్ షిండే, కురియన్‌‌, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, టీజేఎస్ చీఫ్​ కోదండరాం, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య వంటి వారందరికీ ఆహ్వానాలు పంపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేను ఆహ్వానించారు.  సినీ ప్రముఖులు, కులసంఘాల నేతలు, మేధావులు కూడా ఇన్విటేషన్​ పంపారు.

అందరూ రండి :  రేవంత్​ పిలుపు

ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అందరూ రావాలని సీఎల్పీ నేత రేవంత్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలిపి.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘విద్యార్థుల పోరాటం, అమరవీరుల త్యాగాలు, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో.. మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో  డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికి ఇదే ఆహ్వానం’’ అంటూ రేవంత్​ ప్రకటనలో పేర్కొన్నారు.