ఎన్నో.. చెప్పిన్రు : కొన్నే చేసిన్రు

ఎన్నో.. చెప్పిన్రు : కొన్నే చేసిన్రు

నేటితో రెండో టెర్మ్​లో ఏడాది పాలన
పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్

ఎలక్షన్లకు ముందు ఎన్నో
హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్

ఆసరా పింఛన్ల పెంపు ఓకే..
వృద్ధాప్య పింఛన్​ వయసు తగ్గింపు కాలే

రైతు బంధు పెంచినా అందరికీ ఇస్తలేరు
రుణమాఫీ ఊసే లేదు.. హెల్త్​ ప్రొఫైల్​పై స్టేట్​మెంట్లే

నిరుద్యోగ భృతి.. ఉద్యోగులకు పీఆర్సీ ఇయ్యలే

డబుల్​ ఇండ్లు కాలేదు…
సొంత జాగా ఉన్నోళ్లకు సాయం ఊసే లేదు

ఆర్థిక మాంద్యం పేరిట కోతలు!.. నిధుల్లేక ప్రాజెక్టుల పనుల్లో జాప్యం

రాష్ట్రంలో రెండోసారి విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌‌‌‌  శుక్రవారంతో ఏడాది పూర్తి చేసుకుంటున్నారు. 2018 డిసెంబర్‌‌‌‌ 13న ఆయన రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఎలక్షన్లకు ముందు టీఆర్ఎస్​ మేనిఫెస్టోలో 24 అంశాలపై హామీలు ఇచ్చారు. అప్పటికే అమల్లో ఉన్న పథకాల్లో ప్రయోజనాల పెంపు కొన్నికాగా, కొత్తగా మరిన్ని ప్రకటించారు. ఏడాది గడిచిపోయింది. కానీ కీలక హామీల్లో ఒకట్రెండు మాత్రమే ఆచరణలోకి వచ్చాయి. ఆసరా పింఛన్ల కింద ఇస్తున్న మొత్తాన్ని రెండింతలు చేశారు. కానీ వృద్ధాప్య పింఛన్​కు అర్హత వయసు తగ్గింపు అమల్లోకి రాలేదు. రైతు బంధు ఆర్థిక సాయాన్ని పెంచినా.. లక్షలాది మందికి సొమ్ము అందలేదు, రబీ కింద ఇవ్వాల్సిన సాయం ఇంకా విడుదల కాలేదు. రుణ మాఫీ జాడే లేకుండా పోయింది. ఉద్యోగులు పీఆర్సీ, రిటైర్మెంట్​ వయసు పెంపు వాగ్దానాలను ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. సొంత స్థలం ఉన్నవాళ్లకు డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులిస్తామని సీఎం కేసీఆర్​ చెప్పడంతో లక్షలాది మంది పేదలు ఆశలు పెట్టుకున్నారు. . ఎలక్షన్ల సమయంలో టీఆర్ఎస్​ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల పరిస్థితిపై ప్రత్యేక కథనం..

రుణమాఫీ ఊసే లేదు

అధికారంలోకి వచ్చి ఏడాదైనా పైసా ఇయ్యలే.. మార్గదర్శకాలు కూడా ఖరారు కాలేదు. లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ఎలక్షన్ల ముందు సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. గెలిచి అధికారం చేపట్టి ఏడాది అయినా ఇప్పటివరకు దానిపై స్పష్టత ఇవ్వలేదు. రుణమాఫీ కోసం పైసా కూడా విడుదల కాలేదు. అసలు ఇప్పటివరకు మార్గదర్శకాలే రూపొందించలేదు. 2018 డిసెంబర్​11వ తేదీ నాటికి ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రకటించింది. ఆ తేదీ నాటికి రాష్ట్రంలో సుమారు 43 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రూ.32.2 వేల కోట్ల మేర అప్పులు తీసుకున్నారు. అందులో రూ.లక్ష కంటే పైన ఉన్న సొమ్మును తీసేస్తే.. రూ.31,823.24 కోట్ల వరకు రుణమాఫీ కావాల్సి ఉంది. 2019–20 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి రూ.6 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. అందులోనూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతులు సొంత డబ్బులతో అప్పులు కట్టేయాలని, ఆ మేరకు సొమ్మును తర్వాత రైతుల ఖాతాల్లో వేస్తామని సీఎం కేసీఆర్‌ గత అసెంబ్లీ సమావేశాల్లోప్రకటించారు. రైతులేమో అప్పులు చెల్లించే పరిస్థితిలో లేరు. బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వడం లేదని వాపోతున్నారు.

జాగలున్నోళ్లకు ఇస్తనన్న పైసలెవ్వి!

నత్తనడకన డబుల్​
బెడ్రూం ఇండ్ల నిర్మాణం
సొంత స్థలం ఉన్నోళ్లకు
డబ్బులిస్తామన్న సీఎం
నిధుల కొరతతో ఇబ్బందులు

రాష్ట్రంలో సొంత స్థలం ఉన్న పేదలు డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని ఎలక్షన్ల ముందు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. డబుల్​బెడ్రూం పథకాన్ని కొనసాగిస్తూనే.. ఆర్థిక సాయాన్నీ అమలు చేస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు జరగలేదు, ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కనీసం మార్గదర్శకాలు రూపొందించేందుకూ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది దీనికోసం ఎదురుచూస్తున్నారు. డబుల్​ ఇండ్ల కోసం సర్కారు ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​లో రూ.2,400 కోట్లు కేటాయించగా.. పూర్తిస్థాయి బడ్జెట్​లో రూ.180 కోట్లకు తగ్గించింది.

ఇండ్లు లేటయితున్నయ్..

సీఎం కేసీఆర్​ డబుల్​ బెడ్రూం ఇండ్ల పథకాన్ని నాలుగేండ్ల కింద ప్రారంభించారు. 2020 మార్చి నాటికి రెండు లక్షల ఇండ్లను పూర్తిచేసి, పేదలకు అందిస్తామన్నరు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 82 వేల ఇండ్లను మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు 40 వేల ఇండ్లు కూడా పూర్తి కాలేదు. చాలా చోట్ల పనులు పిల్లర్ల దశలోనే ఉన్నాయి.మూడు జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తికాకపోగా.. మరో ఏడు జిల్లాల్లో 200లోపే ఇండ్లు కట్టారు. నిధుల కొరత, బిల్లుల పెండింగ్ కు తోడు ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. ఒక్క గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో మాత్రం ఇండ్ల నిర్మాణం కొంత వేగంగా సాగుతోంది.

57 ఏండ్లు దాటినోళ్లకు ఇంకారాని పెన్షన్లు

రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని టీఆర్ఎస్​  మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లోని కొన్ని డివిజన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. వయో పరిమితి తగ్గింపుతో కొత్తగా 7 లక్షల మంది వరకు లబ్ధిదారులు పెరుగుతారని అంచనా వేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. కానీ అమల్లోకి రాలేదు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో 15 రోజుల నుంచి నెల రోజుల ఆలస్యంగా పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తవాళ్లకు రూ. 2,016 చొప్పున పెన్షన్‌ ఇస్తే.. నెలకు రూ.140 కోట్ల చొప్పున ఏటా సుమారు రూ.1,680 కోట్ల భారం పడుతుంది. దీంతో కొత్త పెన్షన్ల మంజూరుపై నీలినీడలు అలుముకున్నాయి.

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఊసేది?

‘‘ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది’’.. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో 8వ హామీ ఇది. ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం కొత్త పథకాలు రూపొందించేందుకు కడియం శ్రీహరి నేతృత్వంలో మేనిఫెస్టో సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధితో పాటు వారి ఆవాస ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై సూచనలు చేసింది. స్వయం ఉపాధి కోసం రూ.2 లక్షల సాయం అందించాలని, నాలుగేండ్లలో 28 లక్షల కుటుంబాలకు పథకం చేరాలని పేర్కొంది. అంతేగాకుండా ఐదేండ్లలో ఎస్సీల సమగ్రాభివృద్ధికి రూ.15 వేల కోట్లు, ఎస్టీలకు రూ.6 వేల కోట్లు కేటాయిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. కమిటీ సూచనలు, కేసీఆర్ హామీల అమలుపై ప్రయత్నాలు జరగలేదు.

నిరుద్యోగ భృతి బడ్జెటే గాయబ్‌?

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రూ. రూ.3,016 భృతి ఇస్తామని ఎలక్షన్ల ముందు కేసీఆర్​ ప్రకటించారు. దానిపై ఇప్పటికీ ముందడుగు పడలేదు. నిరుద్యోగులను ఎలా నిర్ధారించాలన్న మార్గదర్శకాలపైనా చర్చ జరగలేదు. 2014లో ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్​కేఎస్) ప్రకారం12 లక్షల వరకు నిరుద్యోగులు ఉంటారని అంచనా వేశారు. అంతకు మించి ఉన్నా కూడా భృతి ఇస్తామని కేసీఆర్​ చెప్పారు. భృతి అమలు చేస్తున్న రాష్ట్రాలకు వెళ్లి పరిశీలిస్తామన్నారు. కానీ రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఎక్కడికి వెళ్లలేదు. ఫిబ్రవరిలో పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిరుద్యోగ భృతి కింద రూ.1,810 కోట్ల నిధులు చూపారు. సెప్టెంబర్​లో ప్రకటించిన బడ్జెట్లో ఆ కేటాయింపులనూ తొలగించేశారు. నేతలుగానీ, అధికారులుగానీ నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు.

రిటైర్మెంట్ ఏజ్ పెంచనేలేదాయె

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ ను 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచుతామన్న హామీ అమలు కాలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తున్నా హామీపై నిర్ణయం తీసుకోలేదు. చాలా రాష్ట్రాల్లో రిటైర్ మెంట్ వయసు 60 ఏండ్లుగా ఉంది. ప్రతి నెలా వివిధ శాఖల్లో 500 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఉద్యోగాల భర్తీ ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. భర్తీ ప్రక్రియ ముగించి విధుల్లో చేరటానికి నెలల టైం పడుతోంది. ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలు, కోర్టు వివాదాల టైంలో సీనియర్ ఉద్యోగులు అవసరమని, రిటైర్​మెంట్​ ఏజ్ పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

నిధుల్లేక ఆగుతున్న పనులు

‘కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ, డిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన సాగిస్తం’ అని కేసీఆర్​ ప్రకటించారు. ఈ నాలుగు ప్రాజెక్టుల్లో కాళేశ్వరం నిర్మాణం పాక్షికంగా పూర్తయింది. అధికారికంగా ప్రాజెక్టును ప్రారంభించినా నీటి విడుదల కాలేదు. మిడ్‌‌ మానేరు నుంచి మల్లన్నసాగర్‌‌ వరకు నీటిని తరలించే సిస్టం దాదాపు పూర్తయినా.. భూసేకరణ బిల్లుల చెల్లింపు, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీల్లో సమస్యలతో నీళ్లు ఎత్తిపోయలేదు. కొండపోచమ్మసాగర్ వరకు పంపుహౌస్‌‌ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు సంకటంలో పడ్డాయి. తొలుత ఒక్క టీఎంసీ ఎత్తిపోత పనులే చేపట్టాలని సీఎం మౌఖికంగా ఆదేశించడంతో.. ప్రాజెక్టు పనులను ఒక్క టీఎంసీ కెపాసిటీకే పరిమితం చేశారు.

సీతారామ ప్రాజెక్టును వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు.డిండి ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. దానికి నీటిని ఎక్కడి నుంచి తరలించాలన్న దానిపై ఎడతెగని చర్చలు సాగుతున్నాయే తప్ప అడుగు ముందుకు పడలేదు.

నిర్మాణంలో ఉన్న మిగతా ప్రాజెక్టులు.. నిధుల కేటాయింపుల్లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇరిగేషన్‌‌ బడ్జెట్‌‌ను రూ.25 వేల కోట్ల నుంచి రూ. 8,490 కోట్లకు తగ్గించడంతో ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్లు పెండింగ్‌‌ బిల్లుల కోసం జలసౌధ, ఫైనాన్స్‌‌ సెక్రెటరీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

క్యాంపులు పెట్టలె.. టెస్టులు చెయ్యలే..

మొదలుకాని హెల్త్​ ప్రొఫైల్
ఆపరేషన్లు లేకుండానే
ముగిసిన కంటి వెలుగు

రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ క్యాంపులు పెట్టి ప్రతి వ్యక్తికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని టీఆర్ఎస్​ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఆ టెస్టుల ఆధారంగా ప్రతి వ్యక్తి హెల్త్ వివరాలు రికార్డు చేసి, ఆ వివరాలతో రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టులో సీఎం సొంతూరు చింతమడకలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌‌ హెల్త్ క్యాంపు పెట్టింది. ఓ నాలుగు గ్రామాల ప్రజలకు టెస్టులు చేశారు. అది హెల్త్ ప్రొఫైల్‌‌లో భాగమేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ తర్వాత మరెక్కడా హెల్త్ క్యాంపులు పెట్టలేదు, టెస్టులు చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా క్యాంపులు పెట్టి టెస్టులు చేయడం సాధ్యం కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ రూపాల్లో ఆరోగ్యశాఖ వద్ద ఉన్న డేటానే క్రోడీకరించి వ్యక్తుల హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తామని అంటున్నారు.

కంటి ఆపరేషన్లు ఆగిపొయినయ్..

కంటి వెలుగును అద్దాల పంపిణీకే పరిమితం చేశారు. పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,54,72,849 మందికి టెస్టులు చేసి.. 9,30,968 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. ఇందులో 6.64 లక్షల మందికి కంటి శుక్లాల (కేటరాక్ట్‌‌) ఆపరేషన్లు, మిగతా వారికి కార్నియా, గ్లకోమా తదితర చికిత్సలు అవసరం. ఇందులో 5 వేల మందికి కూడా ఆపరేషన్లు జరగలేదు. తర్వాత కార్యక్రమాన్ని అటకెక్కించారు.

అడుగు పడని ‘పోడు’

రాష్ట్రంలో గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూముల సమస్యకు ముగింపు పలుకుతామని టీఆర్ఎస్​ మేనిఫెస్టోలో పెట్టింది. సీఎం కేసీఆర్​ కూడా పలుమార్లు ప్రకటన చేశారు. పోడు రైతులకు యాజమాన్య హక్కులు కల్పించి రైతు బంధు, రైతు బీమా పథకాలు వర్తింపజేస్తామని.. ప్రతి జిల్లాకు తానే వచ్చి కుర్చీ వేసుక్కూర్చుని సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా పోడు సమస్య పరిష్కారానికి అడుగు ముందుకు పడలేదు. పట్టాల కోసం లక్షలాది  రైతులు ఎదురు చూస్తున్నారు. 7,41,888 ఎకరాల అటవీ భూమి రైతుల చేతుల్లో ఉన్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. హరితహారం కింద అటవీ భూముల్లో మొక్కలు నాటాలని సర్కారు ఆదేశించడంతో.. ఫారెస్టు అధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో రైతులకు, ఫారెస్ట్ సిబ్బంది మధ్య గొడవలు జరుగుతున్నాయి. 2006లో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్‌‌ ‌‌‌‌పోడు భూములకు సంబంధించి 93 వేల మందికి హక్కు పత్రాలిచ్చారు. 80 వేల మందికి నిరాకరించారు. 3.3 లక్షల ఎకరాల భూమి వారి ఆధీనంలోనే ఉంది. పదేళ్లుగా మరో 4.11 లక్షల ఎకరాలు పోడు కొట్టినట్టు అటవీ శాఖ గుర్తించింది.

రైతు బంధుకు ఇబ్బందులు

ఖరీఫ్‌లో 11.75 లక్షల
మందికి ఇవ్వలే..
రూ.1,754 కోట్లు పెండింగ్‌
రబీలో ఇవ్వాల్సింది
రూ.7,254 కోట్లు

ఇంకా విడుదల చేయని సర్కారు

ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతుబంధు కోసం బడ్జెట్​లో సర్కారు రూ.6,900 కోట్లు కేటాయించింది. అందులో రూ.5,500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో 45 లక్షల మంది రైతులకే సాయం అందింది. తమకు సొమ్ము అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధుపై టీఆర్ఎస్​ సర్కారు ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. రైతుబంధు సొమ్మును ఏటా ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ మేరకు సొమ్మును పెంచారు. కానీ రైతులందరికీ పైసలు అందలేదు. వానాకాలం సీజన్‌కు సంబంధించి 56.75 లక్షల మంది రైతులకు సొమ్ము ఇవ్వాల్సి ఉండగా.. 11.75 లక్షల మందికి రాలేదు. ఇక యాసంగి సీజన్‌ నవంబర్​లోనే మొదలైనా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. పంటల సాగుకు పెట్టుబడి సాయం కోసం ఈ స్కీమ్​ చేపట్టగా సాగు మొదలైపోయినా సొమ్ము అందని పరిస్థితి నెలకొంది.

రబీలో 58 లక్షలు మంది రైతులకు రైతుబంధు అందాలి. ఇందుకోసం రూ.7,254 కోట్లు అవసరం. వాస్తవానికి ఈ సొమ్మను అక్టోబర్​చివర్లోగానీ, నవంబర్​ తొలివారంలోగానీ విడుదల చేయాలి. కానీ సర్కారు వద్ద నిధుల్లేక విడుదల చేయడం లేదు. ‘రైతు బంధు’పథకంలో కొన్ని షరతులు పెట్టాలని, భారాన్ని తగ్గించుకోవాలని సర్కారు భావిస్తున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.

ఈ హామీలేవీ ముందుకు పడలే..

కులాల కార్పొరేషన్లు రాలే..

‘రెడ్డి, వైశ్య కార్పొరేషన్లతోపాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తం.’అని మేనిఫెస్టోలో 13, 14వ అంశాలుగా చేర్చారు. వైశ్య కార్పొరేషన్‌‌ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. రెడ్డి కార్పొరేషన్‌‌ పై మొదట్లో కదలిక కనిపించినా తర్వాత పక్కనపడింది. ఎస్సీల్లో వేర్వేరు కులాలకు వేర్వేరు కార్పొరేషన్లు, వెలమ (పద్మనాయక) కార్పొరేషన్‌‌, బీసీల్లోని కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చినా ప్రభుత్వపరంగా ఎలాంటి కదలికా లేదు.

ఉక్కు ఫ్యాక్టరీ జోలే లేదు

మహబూబాబాద్‌‌ జిల్లా బయ్యారం వద్ద ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని 22వ హామీగా ప్రకటించారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.

రిటైర్డ్ ఉద్యోగులకు
డైరెక్టరేట్ ఎప్పుడు?

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్​ ఏర్పాటు చేస్తమని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ అమల్లోకి రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,70,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నట్టు అంచనా. ముఖ్యంగా కేసుల కారణంగా పెన్షన్  ఆగిపోవడం, తక్కువగా వస్తుండటం, హెల్త్ కార్డులు పనిచేయకపోవటం వంటి సమస్యల పరిష్కారం కోసం వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఎస్సీ వర్గీకరణ, బీసీ, మహిళా రిజర్వేషన్లూ అంతే..

ఎస్సీ వర్గీకరణ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌‌ అమలు చేస్తామని 2014 ఎన్నికల్లోనే టీఆర్ఎస్‌‌ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక దానిపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని సీఎం కేసీఆర్​ పలుమార్లు చెప్పారు. కానీ ఇవేవీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు.

అగ్రకుల పేదలకు పథకాలేవీ?

అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో 15వ అంశంగా చెప్పారు. కానీ ఆ దిశగా ఒక్క ప్రయత్నమూ చేయలేదు. కనీసం ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. అగ్రకులాల్లోని పేదల స్వయం ఉపాధి కల్పన, ఇతర ప్రత్యామ్నాయాల దిశగా ఒక్క అడుగూ పడలేదు.

విశ్వనగరం..హెచ్‌‌ఎండీఏదే భారం

‘హైదరాబాద్‌‌ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేయడం జరుగుతుంది.’ అని 24వ హామీగా ప్రకటించారు. కానీ సర్కారు నుంచి పెద్దగా ప్రయత్నాలేమీ లేవు. మొత్తం భారం హెచ్‌‌ఎండీఏపైనే వేశారు. స్కై వేల నిర్మాణాన్ని ఎస్‌‌ఆర్డీపీ నిధులతో జీహెచ్‌‌ఎంసీయే చేపట్టనుండగా, ఎంఎంటీఎస్‌‌ విస్తరణ ఖర్చును రైల్వేశాఖ, జీహెచ్‌‌ఎంసీ సంయుక్తంగా భరిస్తున్నాయి. గతంలో ఉప్పల్‌‌ భగాయత్‌‌  భూముల వేలం ద్వారా హెచ్‌‌ఎండీఏకు రూ.670 కోట్ల ఆదాయంరాగా ప్రభుత్వం అందులో సగానికిపైగా నిధులను వేరే పనులకు మళ్లించింది. ఇక మెట్రో రైల్‌‌ విస్తరణ పనులను హెచ్‌‌ఎంఆర్‌‌ఎల్‌‌, హెచ్‌‌ఎండీఏ సంయుక్తంగా చూస్తున్నాయి. హుస్సేన్‌‌సాగర్‌‌ సుందరీకరణ, దాని కింద ఏర్పాటు చేసిన మూడు ఎస్టీపీల నిర్వహణను హెచ్‌‌ఎండీఏనే చూస్తోంది.

12% రిజర్వేషన్ల  మాటే మరిచిన్రు

ముస్లింలు, ఎస్టీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ నేటికీ నెరవేరలేదు. రాష్ట్రంలో 9.34 శాతం గిరిజనులు, 12.7 శాతం ముస్లింలు ఉన్నారు. వారికి 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించడంపై టీఆర్ఎస్​ సర్కారు ఫస్ట్‌‌ టెర్మ్‌‌లో అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపింది. ఎలాగైనా రిజర్వేషన్లు కల్పించి తీరుతామని, కేంద్రంతో పోరాడుతామని సీఎం కేసీఆర్‌‌ పలుసార్లు ప్రకటించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని.. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. కానీ అడుగు ముందుకు పడలేదు. ఈ అంశంపై మంత్రులు, ఎంపీలు, నేతలెవరూ మాట్లాడటం లేదు. తాజాగా జరుగుతున్న పార్లమెంట్‌‌ సమావేశాల్లో కూడా ఎంపీలు ప్రస్తావించలేదు.

పీఆర్సీ కోసం ఎదురుచూపులే..

గతేడాది జులై నుంచే రావాల్సిన వేతన పెంపు
ఐఆర్ అయినా ఇవ్వాలంటున్న ఉద్యోగులు

వేతన సవరణ కోసం రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు వీలైనంత త్వరగా వేతన సవరణ చేస్తామని ఎలక్షన్ల సమయంలో సీఎం కేసీఆర్​ చెప్పారు. గతంలో పీఆర్సీ కమిటీ 29 శాతం సిఫార్సు చేస్తే ఏకంగా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. ఈసారి 63శాతం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నరు. వేతన సవరణ చేయాల్సిన గడువు దాటి ఏడాదిన్నర అవుతున్నా ఈ విషయం ముందుకు పడటం లేదు. పీఆర్సీ కమిటీ ఇప్పటివరకు నివేదికను సర్కారుకు అందచేయలేదు. కనీసం మధ్యంతర భృతి (ఐఆర్) అయినా ప్రకటించలేదు. అయితే 12 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కారు గత నెల పదో తేదీన పీఆర్సీని ఆదేశించింది. ఆ గడువు ముగిసినా నివేదిక అందలేదు. వేతన సవరణలో ఒక్కో శాతం ఫిట్ మెంట్ కు రూ.250 కోట్ల చొప్పున ఖజానాపై భారం పడుతుందని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేశారు. ఈసారి ఫిట్ మెంట్ 30 శాతంలోపే ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి.

ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ యూనిట్ల ఏర్పాటు ఎప్పుడు?

కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ యూనిట్లను నెలకొల్పుతామని టీఆర్ఎస్​ ఎలక్షన్​ మేనిఫెస్టోలో 16వ హామీగా ప్రకటించారు. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్‌‌ చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి వారికి అప్పగిస్తామని పేర్కొన్నారు. కానీ సర్కారు ఏర్పాటై ఏడాది గడిచినా ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ యూనిట్ల ఏర్పాటు ఊసే లేదు. దీనిపై ఇటీవలే కేబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటైంది.