ఇవాళ, రేపో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ సీట్లు ఖరారు అవుతాయి : మంత్రి పొన్నం

ఇవాళ, రేపో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ సీట్లు ఖరారు అవుతాయి : మంత్రి పొన్నం

ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బాండ్లను మోదీ సమర్ధించుకోవడం విచారకరమన్నారు. అవినీతి సొమ్ము పార్టీలోకి వస్తే అది నీతివంతమైన డబ్బు అవుతుందా అని ప్రశ్నించారు. మెగా సంస్థ నుంచి కూడా బీజేపీకి బాండ్ల రూపంలో డబ్బులు వెళ్లాయని చెప్పారు. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కళాశాల గ్రౌండ్ లో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరత్ చంద్రారెడ్డికి బెయిల్ రావడానికి బీజేపీకి ఇచ్చిన 500 కోట్ల బాండ్లే కారణం కాదా అని ప్రశ్నించారు.

కరీంనగర్  కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటామన్న ధీమాతో ముందుకు పోతున్నామన్నారు. ఇవాళ, రేపో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ సీట్లు ఖరారు అవుతాయని తెలిపారు. నేటి నుంచి కాంగ్రెస్ కరీంనగర్  పార్లమెంట్ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టుకుంటున్నామని తెలిపారు.  పదేళ్లు పాలించిన బీజేపీ, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి బీజేపీ ఏమిచ్చిందని,  విభజన హామీలు ఏమయ్యాయని ప్రజల్లోకెళ్లి ప్రశ్నిస్తామన్నారు.

తెలంగాణ ఏర్పాటును అవమానించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో కేంద్రీయ విద్యాలయాలు, పాస్ పోర్టు ఆఫీసు, తిరుపతికి రైలు, నర్సింగ్ కాలేజీ, మాతా శిశు ఆస్పత్రి, మోడల్ స్కూళ్లు, కస్తూరి భా స్కూళ్లు, శాతవాహన యూనివర్శిటీలాంటివి తెచ్చానని తెలిపారు. దమ్ముంటే బండి సంజయ్ నియోజకవర్గంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.