
8 వేలకుపైగా డైరెక్టర్ పదవులు వారికే..
2 వేల వరకు కాంగ్రెస్‌పార్టీ సపోర్టర్లకు..
నేడు పీఏసీఎస్‌ల చైర్మన్లు,వైస్ చైర్మన్ల ఎన్నిక
రేపు డీసీసీబీ ప్రెసిడెంట్ల ఎన్నిక
మొత్తంగా 79.36% పోలింగ్
(వెలుగు, హైదరాబాద్/ నెట్వర్క్) సహకార ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుదారులు సత్తాచాటారు. రాష్ట్రవ్యాప్తంగా 904 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్) పరిధిలోని 11,653 డైరెక్టర్ స్థానాలకు గాను 8వేలకుపైగా వార్డుల్లో విజయం సాధించారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికే 5,405 డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 6,248 డైరెక్టర్ స్థానాలకు శనివారం ఎన్నికలు జరగగా అత్యధిక స్థానాలను టీఆర్ఎస్ మద్దతుదారులే గెలుచుకున్నారు. ఎన్నికలు పార్టీలకతీతంగా జరిగినప్పటికీ ఆయా పార్టీల లీడర్లే బరిలో నిలిచారు. ఏకగ్రీవాలతో కలుపుకొని సుమారు 8వేలకుపైగా డైరెక్టర్ స్థానాలను అధికారపార్టీ లీడర్లే దక్కించుకున్నారు.
ఆ తర్వాత దాదాపు 2వేల స్థానాలతో కాంగ్రెస్ మద్దతుదారులు రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ మద్దతుదారులు మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఎన్నికైన డైరెక్టర్లంతా ఆదివారం 904 ప్యాక్స్‌లకు చైర్మన్లు, వైస్చైర్మన్లను ఎన్నుకుంటారు. ఫలితాలు వెల్లడికాగానే చైర్మన్ ఆశావహులంతా తమ ప్యానల్లోని డైరెక్టర్లను క్యాంపులకు తరలించారు. ఎక్కువమంది డైరెక్టర్లు టీఆర్ఎస్ మద్దతుదారులు కావడంతో పీఏసీఎస్ చైర్మన్లుగా వారే ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఇక ప్యాక్స్ చైర్మన్లు డీసీసీబీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. దానికోసం 17న నోటిఫికేషన్ జారీ చేస్తారు. పాత జిల్లాల ప్రాతిపదికనే డీసీసీబీ అధ్యక్షులను ఎన్నుకోనున్నారు. కాగా, సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించినందుకు రాష్ట్ర రైతాంగానికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. 90 శాతానికి పైగా సొసైటీలు, 100 శాతం డీసీసీబీ, డీసీఎంఎస్ లలో టీఆర్ఎస్ గెలిచిందని అన్నారు.
ప్రశాంతంగా పోలింగ్, కౌంటింగ్..
చిన్న చిన్న ఘర్షణలు మినహా రాష్ట్రవ్యాప్తంగా శనివారం సహకార ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ పూర్తికాగానే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 747 ప్యాక్స్ (పీఏసీఎస్) పరిధిలో 6,248 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 79.36 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం11లక్షల 48 వేల 759 మంది ఓటర్లకుగాను 9 లక్షల11 వేల 599 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 904 ప్యాక్స్‌లు, వాటిల్లోని 11,653 డైరెక్టర్ పదవులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 157 ప్యాక్స్‌లు, 5,405 డైరెక్టర్ పోస్టులు ఏకగ్రీవం అయ్యాయి. 747 సొసైటీల్లోని 6,248 డైరెక్టర్ పదవులకు ఎన్నిక జరిగింది.
పలుచోట్ల ఘర్షణలు
సహకార ఎన్నికల సందర్భంగా పలుచోట్ల చిన్నపాటి గొడవలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట సొసైటీలో కాంగ్రెస్ మద్దతుదారు విష్ణువర్ధన్ రెడ్డిని టీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య గొడవ జరిగింది.
మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ పీఏసీఎస్ లోని 12వ టీసీలో నారాగౌడ్ అనే వృద్ధుడు ఓటు వేసేందుకు సహాయకుడిగా రమేశ్ అనే యువకుడిని తోడుగా తీసుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. నారా గౌడ్ తో పాటు కంపార్ట్ మెంటు లోకి వెళ్లిన రమేశ్ తాను సూచించిన వ్యక్తికి ఓటు వేయలేదని బ్యాలెట్ పేపర్ ను చించి నోట్లో వేసుకొని మింగేశాడు. విషయం తెలిసి అక్కడున్నవారు ఆగ్రహం వ్యక్తం చేయగా రమేష్ అక్కడినుంచి పారిపోయాడు.
కరీంనగర్ జిల్లా మెట్పల్లి సొసైటీలో చైర్మన్ పదవులు ఆశిస్తున్న ఇరువురు నేతలు డైరెక్టర్లను క్యాంపునకు తరలించేందుకు యత్నించగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. హుజూరాబాద్ లో చైర్మన్ రేసులో ఉన్న ఇద్దరు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు.
నల్గొండ జిల్లా వేములపల్లి పీఏసీఎస్ పరిధిలో కాంగ్రెస్ మద్దతుదారు బాలాజీ నాయక్ ను టీఆర్ఎస్ మద్దతుదారులు కిడ్నాప్ చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ సొసైటీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
‘టాస్’తో కలిసొచ్చింది
పీఏసీఎస్ ఎన్నికల్లో పలుచోట్ల క్యాండిడేట్లకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఆఫీసర్లు టాస్ వేసి, విజేతలను ఎంపిక చేశారు.
నల్గొండ జిల్లాలోని తిప్పర్తి పీఏసీఎస్3వ వార్డులో 249 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ మద్దతుదారులకు చెరో 124 ఓట్లు వచ్చాయి. డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి మేడ వెంకన్న గెలుపొందారు.
యాదాద్రి జిల్లా గుండాల సొసైటీలోని 8వ వార్డులో టీఆర్ఎస్ బలపర్చిన చాడ పెంటమ్మ, కాంగ్రెస్ బలపర్చిన బొట్ల కిష్టమ్మకు సమానంగా 97 ఓట్ల చొప్పున వచ్చాయి. ఆఫీసర్లు డ్రా తీయగా పెంటమ్మ గెలుపొందారు. చౌటుప్పల్ సొసైటీలోని 2వ వార్డులో సీపీఎం బలపర్చిన బోరేం నర్సిరెడ్డి, టీఆర్ఎస్ బలపర్చిన కాయితి నరేందర్ కు చెరో 100 ఓట్లు వచ్చాయి. డ్రాలో సీపీఎం బలపర్చిన నర్సిరెడ్డి గెలుపొందారు. మోత్కుర్ లోని 3వ వార్డులో బీజేపీ బలపర్చిన బయ్యని చంద్రశేఖర్, టీఆర్ఎస్ బలపర్చిన బోయిని యాకయ్య కు సమానంగా 104 ఓట్ల చొప్పున వచ్చాయి. డ్రాలో బీజేపీ బలపర్చిన చంద్రశేఖర్ గెలుపొందారు.
మెదక్ జిల్లా రాంపూర్ 6వ టీసీలో పోచయ్య, విశ్వనాథం అనే అభ్యర్థులిద్దిరికీ చెరో 10 ఓట్లు రాగా.. టాస్‌లో పోచయ్య గెలిచారు. ములుగు జిల్లా మంగపేటలోని 6వ టీ సీ నుంచి కాంగ్రెస్‌కు చెందిన గంటా సునీత ఒక్క ఓటుతో, ఏడో స్థానం నుంచి కాంగ్రెస్ కు చెందిన చెట్టుపల్లి సురేష్ డ్రాతో విజయం సాధించారు. కరీంనగర్ జిల్లా గట్టుదుద్దెనపల్లి 4వ వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 69 ఓట్లు వచ్చాయి. టాస్ వేయగా వరికోలు విజయపై ఔదరి విజయ గెలిచారు. సహకార ఎన్నికల ఫలితాలివీ..
ఉమ్మడి జిల్లాల వారీగా సీట్లు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇతరులు
ఆదిలాబాద్ 997 812 108 52 14
వరంగల్ 1,260 957 245 20 34
నల్గొండ 1,414 919 396 18 81
కరీంనగర్ 1,612 1,255 181 96 80
మెదక్ 1,433 1,028 336 20 49
ఖమ్మం 1,073 840 85 05 143
నిజామాబాద్ 1,859 1,515 162 48 134
మహబూబ్ నగర్ 1,001 744 97 59 68
(శనివారం అర్ధరాత్రి వరకు అందిన వివరాల ప్రకారం..)
రంగారెడ్డి జిల్లా బాటసింగారం సహకార సంఘం ఎన్నికల్లో ముగ్గురు వ్యక్తులు రెండుచోట్ల ఓటేశారంటూ లీడర్లు పోలింగ్ కేంద్రంలో బైఠాయించి ఆందోళనకు దిగారు.