
నాటకాల్లో నటించే వాళ్ళని చూసుంటారు, సరదా కోసం స్కూల్స్, కాలేజెస్లో నటించిన వాళ్ళని చూసుంటారు కానీ రియల్ లైఫ్ లో నటించి రియల్ గెస్టులనే దొంగతనం చేయడం చూసారా... అచ్చం ఇలాంటి సిన్ ఒకటి బెంగుళూరులో చోటు చేసుకుంది. దింతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 57 ఏళ్ల వ్యక్తిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. లగ్జరీ హోటళ్లలో జరిగే హై-ప్రొఫైల్ కార్యక్రమాలకు గెస్టుగా హాజరై తరువాత నిజమైన గెస్టుల నుండి విదేశీ నోట్లు, భారత కరెన్సీ నోట్లను దొంగిలించినందుకు అరెస్టు చేశారు.
కొంతకాలం క్రితం బెంగళూరులోని ప్రముఖ హోటల్ షాంగ్రి-లాలో దొంగతనం జరిగినట్లు వెలుగులోకి వచ్చిన వారాల తర్వాత చింతకింది శ్రీనివాసులు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 21 నుండి జూన్ 28 మధ్య బెంగళూరులోని షాంగ్రి-లా హోటల్‌లో APAC గ్రూప్ నిర్వహించిన APAC-2025 అన్యువల్ మీటింగుకు శ్రీనివాసులు హాజరయ్యారు. హోటల్ మొదటి అంతస్తులో జరిగిన ఈ కార్యక్రమంలో రోజర్ నీన్‌పో షెంగ్‌తో సహా చాల మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.
అయితే జూన్ 23న షెంగ్ బ్యాగ్ నుండి $300 అమెరికన్ డాలర్లు, 3,000 తైవానీస్ డాలర్లు కనిపించకుండా పోయాయి. దింతో అతను హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తర్వాత పోలీసులు శ్రీనివాసులును మొదట అనుమానితుడిగా గుర్తించారు. గాలింపు చర్యలు ప్రారంభించిన కొన్ని వారాల తర్వాత, అధికారులు నిందితుడిని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
అంతేకాకుండా ఖరీదైన హోటళ్లలో జరిగిన మరో రెండు దొంగతనాల కేసులకి సంబంధించి కూడా శ్రీనివాసులును విచారించారు. పోలీస్ విచారణలో శ్రీనివాసులు ఫైవ్ స్టార్ హోటళ్లలో నిర్వహించిన చాల కార్యక్రమాలలో గెస్టుగా నటించానని ఒప్పుకున్నాడు. అయితే నిందితుడి నుండి పోలీసులు దాదాపు రూ.41,079 స్వాధీనం చేసుకున్నారు. వాటిలో $270 డాలర్లు, 2,900 తైవానీస్ డాలర్లు, 200 ఆస్ట్రేలియన్ డాలర్లు, 10,000 లావోషియన్ కిప్(Laotian Kip) కరెన్సీ ఉన్నాయి.